ఆదిలాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది వానకాలంలో రైతులు 5.80 లక్షల ఎకరాల్లో సాగు వేశారు. పత్తి 4.25 లక్షల ఎకరాలు, సోయాబిన్ 90 వేలు, కంది 60 వేల ఎకరాల్లో సాగైంది. ఈ సీజన్ ప్రారంభం నుంచి రెండు నెలలపాటు వర్షాలు సాగుకు అనుకూలించడంతో రైతులు దిగుబడులపై ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టు రెండో వారంలో కురిసిన భారీ వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. ఆగస్టు 16న తాంసి మండలం కేంద్రంలో 17 సెంటీ మీటర్ల వర్షం పడింది. పొలాలు నీట మునగగా, వరద నీరు ప్రవహించి ఇసుక మేటలు వేశాయి.
కాత దశలో ఉన్న పత్తి, సోయా పంటలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఉన్న పంటలను కాపుడుకునేందుకు ఎరువులు, పిచ్కారి మందులకు అదనంగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. రైతులు పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసినా.. వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. పత్తి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 5 నుంచి 6 క్వింటాళ్లు, సోయాబిన్ 10 క్వింటాళ్లకు 5 క్వింటాళ్లు వచ్చింది. దీంతో రైతులకు ఈ ఏడాది పెట్టుబడులు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి.

ఆగస్టులో పడిన వర్షాల కారణంగా జిల్లాలో 20,548 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. పత్తి 15,103 ఎకరాలు, సోయా 2,900, కంది 1845, మొక్కజొన్న 660, ఇతర పంటలు 100 ఎకరాల్లో నష్టపోయినట్లు నివేదికలు తయారు చేశారు. ఆగస్టు 19న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అధికారులతో సమావేశం నిర్వహించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ప్రకటనతో కొంతమేర ఊరట లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. మంత్రి పర్యటించి దాదాపు రెండున్నర నెలలు రోజులు గడుస్తున్నా సాయం అందలేదు. మంత్రి ఇచ్చిన హామీ నెరవేరుతుందా అని రైతులు చర్చించుకుంటున్నారు.

వర్షాల కారణంగా భారీ నష్టం జరగగా.. చేతికొచ్చిన పంటను అమ్ముకొనేందుకు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. సోయాబిన్ కోతలు పూర్తయి నెల రోజులు దాటిన తర్వాత ఆదివారం ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లను నామమాత్రంగా ప్రారంభించింది. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ముందుగా ఎంపిక చేసిన ఒకరిద్దరు రైతుల నుంచి పంటను కోనుగోలు చేశారు. బార్కోడ్ రాని కారణంగా కొనుగోలు చేసిన వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే అవకాశం లేదు. దీంతో వారు బార్కోడ్ వచ్చేంత వరకు మార్కెట్ యార్డులో ఉండాల్సి వస్తుంది.
సోయాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.5328 ఉండగా ప్రైవేటులో క్వింటాలుకు రూ.4300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడం లేదు. రైతులు తమ ఇండ్లు, గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలు, మార్కెట్ యార్డుల్లో సోయాబిన్ నిల్వ చేసి ప్రభుత్వం ఎప్పుడు కొంటుందా? అని ఎదురు చూస్తున్నారు.
పత్తి రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వర్షాల కారణంగా పంటలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. క్వింటాలుకు రూ.8110తో ప్రభుత్వం పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన తేమ రైతుల పాలిట శాపంగా మారింది. 8 శాతం తేమ ఉంటేనే మద్దతు ధర చెల్లిస్తూ ఒక్కో శాతానికి రూ.81 కోత విధిస్తూ 12 శాతం తేమ వరకు కొనుగోలు చేస్తున్నది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.6800 చొప్పున సేకరిస్తున్నారు. మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.1200 తక్కువ వస్తుండడంతో రైతులు ప్రైవేటుకు పత్తిని అమ్మడం లేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఆరు రోజులు కిందట పత్తి కొనుగోళ్లు ప్రారంభమైన పంట రాక మార్కెట్ యార్డు నిర్మానుష్యంగా కనిపిస్తున్నది.