పత్తి రైతుపై కేంద్రం కత్తి గట్టింది. కొనుగోళ్లలో సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. అధిక వర్షాలకు ఒకవైపు పంట నాశనమై మెజార్టీ రైతులు తీవ్రంగా నష్టపోతే.. పండిన కాస్త పత్తినీ సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవాలంటే అనేక ఆంక్షలు విధిస్తున్నది. ఎకరానికి 12 క్వింటాళ్లకు బదులు 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామంటూ మెలిక పెట్టడంతోపాటు కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు తప్పనిసరి అని నిబంధన తీసుకురాగా, స్లాట్ బుకింగ్ విధానం పెద్ద తలనొప్పిగా మారింది. కొందరి వద్ద స్మార్ట్ ఫోన్లు లేక, ఉన్నవారికి నమోదు ఎలా చేయాలో..? తెలియక అవస్థలు పడుతుండగా, అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ చోద్యం చూడడంపై విమర్శలకు తావిస్తున్నది. ఒకవేళ ఈ చిక్కులన్నీ అధిగమించి సెంటర్లకు వెళ్తే తేమ పేరిట క్వింటాల్‌కు 2 నుంచి 4 కిలోలు కటింగ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిబంధనలు ఎత్తేయాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నది.
చొప్పదండి, నవంబర్ 10: పత్తి రైతును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిండా ముంచుతున్నది. కొనుగోళ్లలో కొత్త కొత్త నిబంధనలు తెస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నది. ఈ సీజన్లో ప్రత్యేకంగా ‘కపాస్ కిసాన్’ మొబైల్ కొత్త యాప్‌ను తెచ్చి మరో ఇబ్బందికి తెరతీసింది. పత్తి పంట సాగు చేసిన రైతులు ఈ యాప్‌లో ఎన్రోల్, స్లాట్ బుకింగ్‌ను తప్పనిసరిగా చేసుకోవాలని రూల్స్ తీసుకొచ్చింది. ఆ విధంగా నమోదు చేసుకున్న రైతుల పత్తిని మాత్రమే సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేస్తున్నది. అందుకుగానూ ముందుగా రైతులు స్మార్ట్ ఫోన్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆధార్ కార్డుకు లింక్ ఉన్న మొబైల్ నంబర్ ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తుంది. అందులో వచ్చిన బార్ కోడ్ క్లిక్ చేస్తే రైతుల పేరు, చిరునామాతో పాటు ఎన్ని ఎకరాలలో పత్తి పంట వేశారో చూపిస్తుంది. అయితే నిబంధనల గ్రామాల్లో నిరక్షరాస్యులకు ఇబ్బందిగా మారింది. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ఉన్న వారికి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియకపోవడంతో ఉపయోగించలేకపోతున్నారు. ఇక మరికొందరు రైతులకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నా పాస్‌బుక్, ఆధార్ కార్డుకు ఒకే ఫోన్ నంబర్ లింక్ లేకపోవడంతో సమస్యలు తలెత్తున్నాయి. అయితే యాప్‌లో స్లాట్ బుక్ చేస్తే 24 గంటలు మాత్రమే సమయం ఉంటుంది. టైం దాటితే మళ్లీ బుక్ కాకపోవడంతో రైతులు తీసుకెళ్లిన పత్తి తిరిగి ఇంటికి తెస్తున్నారు. ఇదిలా ఉంటే యాప్‌పై అవగాహన కల్పించాల్సిన వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, ఒకవేళ రైతులే వెళ్లి అధికారులను అడుగుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాప్ కౌలు రైతులకు గుదిబండలా మారింది. భూములు మరొక్కరి పేరు మీద ఉండడం, ఫోన్ నంబర్ మరొకటి కావడంతో అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది.

ఒకవేళ ‘కపాస్ కిసాన్’ యాప్‌లో రైతన్న కష్టాలు పడి స్లాట్ బుకింగ్ చేసుకున్నా.. పత్తి కొనుగోళ్లలోనూ కేంద్రం పరిమితులను విధించింది. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తినే కొంటామంటూ సీసీఐ నిబంధనల్లో పేర్కొంది. గతంలో రైతు ఎంత పత్తిని సీసీఐకు తీసుకొచ్చినప్పటికీ కొనుగోలు చేసేవారు. అయితే, ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. తీరా ఇప్పుడు చేతికి దిగుబడి వచ్చాక ఎకరాకు ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా అతివృష్టితో ఈసారి పత్తిలో తేమ శాతం పెరిగింది. అయితే 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే పత్తిని కొంటామని సీసీఐ మరో నిబంధన పెట్టడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో పత్తిలో తేమ 15 శాతం నుంచి 20 శాతం వరకూ నమోదవుతున్నదని, ఇలాంటి సమయంలో కొర్రీలు పెట్టడం ఎందుకని మండిపడుతున్నారు. ఒక వేళ కొనుగోలు చేసినా పత్తిలో నాణ్యత లేదంటూ క్వింటాల్‌కు 2 నుంచి 5 కిలోల వరకు కటింగ్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు హమాలీ, వాహనాల చార్జీలు, వెయిటింగ్ చార్జీలతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నిబంధనలతో కడుపు మండి తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం తన ఏకపక్ష చర్యలను పక్కనబెట్టి పత్తి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ యేడు పత్తి పంటతో లాభం లేదు. మొన్నటి వర్షాలతో పంట తెగుళ్ల బారినపడి పూత కాత రాలిపోయినయి. దిగుబడులు తగ్గిపోయినయి. పండిన కాస్త పత్తిని సీసీఐలో అమ్ముకుందామంటే ప్రభుత్వం కొత్త కొత్త కొర్రీలు పెడుతున్నది. కపాస్ కిసాన్ యాప్‌తో మస్తు ఇబ్బందైతంది. స్మార్ట్ ఫోన్లేక కొందరు, యాప్‌పై అవగాహన లేక మరికొందరు అవస్థలు పడుతున్నరు. ప్రభుత్వం యాప్‌ను తీసేసి కొర్రీలు లేకుండా పత్తిని కొనాలి.
ఈ యేడాది పత్తి పంట వేసి తీవ్రంగా నష్టపోయిన. అధిక వర్షాలతో పంట దిగుబడి అనుకున్న స్థాయిలో రాలేదు. స్లాట్ బుక్ చేసుకొని అమ్ముకునేందుకు సీసీఐకి పోతే తేమ శాతం పేరుతో కొర్రీలు పెడుతున్నరు. ఆ స్లాట్ పనికిరాకుండా అయితంది. ఒకవేళ కొన్నా కటింగ్ చేస్తున్నరు. మళ్లీ చేసుకునుడు అంటే చానా ఇబ్బందైతంది. దోచుకుంటున్నరు. నిబంధనలు తొలగించి తేమ శాతం కొంత మినహాయించి మద్దతు ధర కల్పించాలి.
నాకున్న భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసిన. వర్షాలకు పంట పూర్తిగా పాడైపోయింది. ఎకరాన 10 నుంచి 12 క్వింటాళ్లు వస్తదని అనుకుంటే 7నుంచి 8 క్వింటాళ్లు కూడా అచ్చేటట్లు లేదు. అయితే మంచి ధర వస్తుందని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్తే తేమ శాతం 14 వస్తుందని, నాణ్యత లేదని కొర్రీలు పెడుతున్నరు. గంటల తరబడి వాహనాలను నిలిపి పత్తిని దించుకోవడం లేదు. ఒకవేళ కొన్నా క్వింటాలుకు 2 నుంచి 4 కిలోలు కట్ చేస్తున్నరు.