బీఆర్ఎస్ పాలనలో గౌరవంగా సాగిన ఆఖరి మజిలీ, ఇప్పుడు భారంగా మారుతున్నది. సర్కారు అలసత్వం, అధికార యంత్రాంగం పట్టింపులేని తనం పేదలను వేధిస్తున్నది. ప్రభుత్వం మారిన తర్వాత కార్మికక్షేత్రం సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో 101 పథకం అమలు అటకెక్కింది. నిలువ నీడ లేని కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే కూడా 6,500 అధికారికంగా చెల్లిస్తేనే అంత్యక్రియలు నిర్వహించే దుస్థితి ఉన్నది. దీనిపై పేద, మధ్యతరగతి వర్గాలు ఆగ్రహిస్తున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.
సిరిసిల్ల టౌన్, నవంబర్ 10: నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందకు అష్టకష్టాలు పడేది. వైకుంఠధామాలు లేక.. ఉన్నా వసతులు లేక ఇబ్బందులు పడేది. సిరిసిల్ల మానేరు నది తీరాన శ్మశాన వాటిక నిర్మించాలని నాలుగు దశాబ్దాల నుంచి పాలకులు, అధికారులు చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా నిర్మాణానికి నోచుకోలేదు. అంత్యక్రియల నిర్వహణకు సరైన వసతులు లేక పట్టణవాసులకు ఏండ్లుగా ఇబ్బందులు తప్పలేదు. దాంతో మానేరువాగులోనే అంత్యక్రియలను నిర్వహించగా, కనీస వసతులు లేక అవస్థలు పడాల్సి వచ్చేది. ఆ సమయంలో వర్షం పడిందంటే ఆ బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. అన్నింటికి మించి అంత్యక్రియల అనంతరం స్నానాల కోసం నీళ్లు లేక పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మానేరు తీరంలోని ట్యాంక్ వద్ద ఉన్న బోరు కింద స్నానాలు చేయాల్సి వచ్చేది. కరెంటు పోతే మున్సిపల్ ట్యాంకర్ వచ్చే వరకు అక్కడే ఉండిపోవాల్సిన దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ కష్టాలను తొలగించేందుకు కృషి చేసింది. అప్పటి మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ప్రత్యేక చొరవ చూపారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్, నెహ్రూనగర్ శివారులో ఆధునిక వసతులతో వైకుంఠ ధామాలను నిర్మించారు. అంత్యక్రియల ఘాట్లు, నీటి సదుపాయం, అస్థికలను భద్రపరిచేందుకు లాకర్లు, ఉద్యానవనం ఏర్పాటు చేయించారు. వైకుంఠ రథాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. కార్మికక్షేత్రమైన సిరిసిల్ల పట్టణంలో పేదల అంత్యక్రియలకు భారం కావద్దన్న లక్ష్యంతో అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలోని పాలకవర్గం 101కి అంత్యక్రియలు నిర్వహించాలని తీర్మానం చేశారు. వైకుంఠధామంలో 101 చెల్లిస్తే వైకుంఠరథంతో పాటు అంత్యక్రియలు ఉచితంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించేవారు. ఇండ్లు లేని పేదలకు కార్యక్రమం ముగిసే వరకు స్థానికంగా అందుబాటులో ఉన్న కమ్యూనిటీ భవనాలలో ఆశ్రయం కల్పించి అండగా నిలిచారు.
మున్సిపల్ తీర్మా నం మేరకు 101కి అంత్యక్రియల పథకం సాఫీగా సాగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఈ పథకంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దీంతో మరుసటి రోజు నుంచే పథకాన్ని నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పేదలపై అదనపు భారం పడింది. పథకాన్ని రద్దు చేసిన తర్వాత అంత్యక్రియల నిర్వహణ ఖర్చు కోసం అధికారికంగానే 6500 ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ డబ్బులను మున్సిపల్‌కు చెల్లిస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, పేదలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖర్చులు తమకు భారంగా మారుతున్నాయని వాపోతున్నారు. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని సదరు పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
సిరిసిల్ల పట్టణంలో అంత్యక్రియల నిర్వహణ కోసం మూడు వైకుంఠ రథాలను అందుబాటులోకి తెచ్చారు. అందులో ఒకటి మైనార్టీల కోసం కేటాయించి వినియోగిస్తున్నారు. అయితే, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో వైకుంఠరథాలు మూలనపడ్డాయి. నిర్వహణ సరిగా లేక రిపేర్లు వచ్చాయి. మరమ్మతు చేసి అందుబాటులోకి తేవాల్సి ఉన్నా.. అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో పట్టణవాసులు ఇబ్బంది పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో డబ్బులు వెచ్చించి, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సోమవారం మరణించగా, అంత్యక్రియల కోసం వైకుంఠరథం కావాలని సంబంధిత కుటుంబ సభ్యులు మున్సిపల్ అధికారులను కోరారు. రెండు వాహనాలు రిపేర్‌లో ఉన్నాయని చెప్పడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో డబ్బలు ఖర్చు పెట్టి, ప్రైవేట్ వాహనంలో మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ధామాలు, వైకుంఠరథాలు అందుబాటులోకి తెచ్చారు. మున్సిపల్, గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసి పది నెలలు కావస్తున్నది. గత పాలకవర్గంలో సిరిసిల్లలోని కార్మికవర్గాల కోసం 101కి అంత్యక్రియల నిర్వహణ పథకాన్ని అమలు చేశాం. ప్రభుత్వం మారిన తర్వాత ఈ పథకాన్ని రద్దు చేశారు. దీంతో పేదలకు దాదాపు 7 వేల వరకు భారం పడుతున్నది. వైకుంఠరథాలు సైతం రిపేరుకు వచ్చి మూలనపడ్డాయి. దిక్కుతోచని స్థితిలో ప్రజలు ప్రైవేట్ వాహనాలు ఏర్పాటుచే సుకుంటున్నారు. కలెక్టర్ ఈ సమస్యపై స్పందించి పరిష్కారానికి చొరవ తీసుకోవాలి