జగిత్యాల, నవంబర్ 10 : జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో రూ.వంద కోట్ల భూమి కబ్జా అయ్యిందని వస్తున్న ఆరోపణలు, పత్రికా కథనాలపై అధికారయంత్రాగం తక్షణమే స్పందించి పారదర్శక విచారణ జరిపించాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జడ్పీ మాజీ చైర్పర్సన్ మాట్లాడుతూ, 70 ఏళ్ల నుంచి సమస్య ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల రూ.వంద కోట్ల విలువైన భూమి ప్రభుత్వం నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతిలో బందీ అయ్యిందన్నారు. 138 సర్వే నంబర్లో ఉన్న భూమి విషయం చూస్తే తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా ఉందని విమర్శించారు.
ఆనాడు అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందెవరనే విషయంపై మున్సిపల్ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణలో భూ అక్రమాలు జరిగితే భూమిని స్వాధీనం చేసుకోవడంతోపాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశం ఇకడితోనే ఆగదని, హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవేందర్నాయక్, బీఆర్ఎస్ నాయకులు శీలం ప్రవీణ్, నాచుపెల్లి రెడ్డి, అనురాధ, నక గంగాధర్, రిజ్వాన్, నీలి ప్రతాప్, గంగిపెల్లి వేణుమాధవ్, గాజుల శ్రీనివాస్, మధుకర్, ప్రణయ్, భగవాన్ రాజ్, కోటగిరి మోహన్, నవదీప్, జావీద్, నాయకులు పాల్గొన్నారు.