హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం నత్త నడకన సాగుతున్నది. ఈ నెల 30 నాటికి చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కనీసం 10 శాతం పంపిణీ కూడా పూర్తి కాలేదు. 2025-26 సంవత్సరానికి 30,358 నీటివనరుల్లో రూ.123 కోట్లతో 83 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యశాఖ నిర్ణయించింది.
ఆగస్టులో మొదలుపెట్టాల్సిన చేప పిల్లల పంపిణీని అక్టోబర్ చివరి వారంలో ప్రారంభించారు. 17 జిల్లాల్లో ఇప్పటివరకూ చేపపిల్లల పంపిణీ మొదలుపెట్టలేదు. అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మత్స్యకారులు మండిపడుతున్నారు.