కరీంనగర పాలక సంస్థలో నల్లా కనెక్షన్ల విభాగం గాడి తప్పింది. అధికారుల నిర్లక్ష్యంతో నల్లా పన్నుల వివరాలలో గందరగోళం నెలకొన్నది. బిల్లు చెల్లించినా ఆన్లైన్లో చూపకపోవడం, ఒకరిపై ఒక కనెక్షన్ ఉంటే రెండు, మూడు చూపించడం, యాజమానుల పేర్లు తప్పుల తడకగా ఉండడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 10: నగరపాలక పరిధిలో సుమారు 70 వేలకు పైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా ఆన్లైన్లో నమోదయ్యాయి. అయితే నమోదు సమయంలోనే ఇంజినీరింగ్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అప్పుడే అనేక తప్పులు దొర్లాయని తెలుస్తున్నది. చాలా మంది ఎప్పటికప్పుడు నల్లా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ ఆన్లైన్లో సరిగ్గా నమోదు చేయకపోవడంతో బకాయి ఉన్నట్టే చూపుతున్నదని తెలుస్తున్నది. నగరానికి చెందిన ఓ ఇంటి యజమాని 2021 వరకు నల్లా బిల్లు చెల్లించినట్లు రసీదు చూపిస్తుండగా, 2015 నుంచి చెల్లించలేదంటూ ఇటీవల ఇంజినీరింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే మరో యజమానికి ఆ ఇంటి యజమాని పేరు, ఇతర అన్ని వివరాలను తప్పుగా పేర్కొంటూ నోటీసులు అందించారు.
అలాగే ఓ ఇంటిలో ప్రస్తుతానికి ఒకే నల్లా కనెక్షన్ ఉన్నా రెండు నల్లాలు ఉన్నట్టు పేర్కొంటూ రెండింటికీ సంబంధించిన బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. వీటిపై పూర్తి వివరాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా.. సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పన్నులు చెల్లించినట్టు ఉన్న రసీదుల ఆధారంగా ఆన్లైన్ చేసేందుకు ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పలు ఇళ్లకు ఒక్క నల్లా కనెక్షన్ ఉన్నా రెండు, మూడు ఉన్నట్టుగా ఆన్లైన్లో చూపుతుండగా, వెంటనే సర్వే చేసి చర్యలు చేపడితే ప్రజలు నల్లా పన్నులు చెల్లించే అవకాశముంటుంది. యజమానుల పేర్ల మార్పు విషయంలోనూ అస్తవ్యస్తంగానే ఉంది. రెవెన్యూ విభాగంలో భవన యజమానికి పేరు ఒకటి ఉంటే నల్లా పన్నుల విభాగంలో మరో పేరు కనిపిస్తున్నది. ప్రస్తుతం నల్లా బకాయిల వసూళ్ల కోసం ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేస్తున్న క్రమంలో వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రత్యేకంగా దృష్టిసారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.