 
                                                            కుభీర్ : రెండు నెలలుగా వరుస వర్షాలతో పత్తి పంట ( Cotton crop ) పూర్తిగా దెబ్బ తినడంతో పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దెబ్బతిన్న పత్తి పంటకు కాసిన కాయలు పత్తి తీసుకుందామనుకునే సమయంలో వర్షాలకు పత్తి వేలాడుతూ కింద పడిపోయి తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు పత్తి రైతుల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. భూమిలో విత్తనాలు నాటింది మొదలు రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.
నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubhir) మండలంలో ఈ ఏడాది ఖరీఫ్ లో 25,066 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రస్తుతం పత్తి సేకరణ పనులు మొదలుపెట్టాలనుకుంటున్న సమయంలో వరుస వానలకు( Rains ) పత్తి తడుస్తుండగా తాజాగా మొంథా తుపాను ప్రభావంతో పత్తి పంట తడిసి ముద్దయి నేల రాలుతోంది. ఆగస్టు చివరి వారం నుంచి అక్టోబరు 15 వరకు కురిసిన వర్షాలతో పత్తి చెట్ల కాసిన కాయలు అధిక తేమతో నల్లబడి నేలరాలిపోయాయి.
సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల మేర దిగుబడులు రావాల్సి ఉండగా ప్రతికూల పరిస్థితుల కారణంగా రెండు నుంచి మూడు క్వింటాళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కౌలు రైతులు పేర్కొంటున్నారు.
సీసీఐ కొనుగోలు జరపడంలో ఆలస్యం కావడం, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తేమశాతం తగ్గకపోవడంతో మద్దతు ధర దక్కకపోవచ్చని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో తక్కువ ధరకే దళారులకు విక్రయించే పరిస్థితులు దాపరిచాయని రైతులు అన్నారు.
ప్రభుత్వం స్పందించి పత్తి రైతులను ఆదుకోవాలి : రైతు సత్యనారాయణ

ఎకరాకు రెండున్నర క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం లేదు . వరుస వర్షాలతో పత్తి పంట పూర్తిగా తడిసి ముద్దయింది. ఎకరాకు రెండున్నర క్వింటాల దిగుబడి వచ్చే పరిస్థితి లేదని కుభీర్ మండలం పార్డి (కె) రైతు సత్యనారాయణ వాపోయారు. ప్రభుత్వం స్పందించి పత్తి రైతులను ఆదుకోవాలని, సీసీఐని వెంటనే ప్రారంభించి మద్దతు ధరతో తడిసిన పత్తిని షరతులు లేకుండా కొనుగోలు చేసేలా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
 
                            