కాసిపేట, అక్టోబర్ 31: మంచిర్యాల జిల్లా కాసిపేట (Kasipet) మండలంలోని సోమగూడెంలో 2కే రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ (Run For Unity) కార్యక్రమంలో భాగంగా కాసిపేట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వహించిన 2కే రన్‌ను ఎస్ఐ ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సోమగూడెంలో ప్రారంభమైన రన్ పాత టోల్ గేట్ వరకు సాగింది.
అంతకుముందు కాసిపేట ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. వందలాది స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి, దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన అచంచలమైన కృషి, అకుంఠిత దీక్ష ఎప్పటికీ మరువలేనివన్నారు. పటేల్ దార్శనికత, రాజనీతిజ్ఞత కారణంగానే నేడు మనం చూస్తున్న సమగ్ర భారతదేశం సాధ్యమైందని వెల్లడించారు. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, దేశభక్తికి, త్యాగం, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనమని, ప్రజలందరినీ ఐక్యంగా ఉంచాలనే ఆయన ఆశయం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ‘రన్ ఫర్ యూనిటీ’ ద్వారా సర్దార్ పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ, మన దేశ సమగ్రతను, ఐక్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేసుకుందామని తెలిపారు. ఈ రన్లో పాల్గొనడం ద్వారా, మనం సర్దార్ పటేల్ వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఐక్యతా సందేశాన్ని అందిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.