 
                                                            మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మొంథా తుపాన్ పంజా విసిరింది. అన్నదాతలకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో భారీ వర్షం పడగా, వేలాది ఎకరాల్లో వరి, పత్తి, సోయా పంట దెబ్బతిన్నది. మరికొన్ని రోజుల్లో ఇంటికి వస్తుందనుకున్న ధాన్యం పూర్తిగా నేలరాలిపోగా, ఇక చేలల్లోని దూది తడిసి ముద్దయ్యింది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలు కళ్లముందే చేతికందకుండా పోగా, రైతాంగం కన్నీరుమున్నీరవుతున్నది. అప్పులు తీర్చే మార్గం లేక గుండెలు బాధకుంటున్నది. ప్రభుత్వం నష్టంపై అంచనా వేసి ఆదుకోవాలని వేడుకుంటున్నది.
వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం..
ఆదిలాబాద్ జిల్లాలో 38.8, నిర్మల్ జిల్లాలో 58.9, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 44.8, మంచిర్యాల జిల్లాలో 40.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సుమారు 24 గంటల పాటు ఎడతెరిపి లేకుండా పడిన వర్షం చేతికి అందివచ్చే దశలో ఉన్న వరి, పత్తి పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కోతకోసి ఆరబెట్టిన మక్క, సోయా, వరి, పత్తి వర్షానికి తడిసిపోయాయి. మంచిర్యాల జిల్లాలో మంగళ, బుధవారం కురిసిన వర్షాలకు అన్ని మండలాలు కలుపుకొని దాదాపు 128 గ్రామాల్లో 3,351 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
చెన్నూర్, జైపూర్, మందమర్రి మండలాల్లో 788 ఎకరాల్లో పత్తి, బెల్లంపల్లి, తాండూర్, నెన్నెల, కోటపల్లి, చెన్నూర్, జైపూర్, మందమర్రి, మంచిర్యాల, నస్పూర్, హజీపూర్, దండేపల్లి, జన్నారం, లక్షెట్టిపేట, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో 2,563 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఒక్క చెన్నూర్ మండలంలోనే దాదాపు 1154 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

నిర్మల్ జిల్లాలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద కారణంగా నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. గడ్డెన్న వాగు, స్వర్ణ, కడెం ప్రాజెక్టులకు ఇన్ఫ్లో పెరగడంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు గురువారం ఉదయం 18 వేల క్యుసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, సాయంత్రానికి 9 వేలకు చేరుకున్నది. దీంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 8,812 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే కడెం ప్రాజెక్టుకు 14,932 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, రెండు గేట్ల ద్వారా 16,704 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు స్వల్పంగా 2 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. దీంతో ఒక గేటును ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు.
మక్క తెచ్చి నాలుగు రోజులైతంది.. 
ఇచ్చోడ, అక్టోబర్ 30 ః నాకున్న రెండున్నరెకరాల్లో మక్క వేసిన. 50 క్వింటాళ్ల దిగుబడి రావడంతో నాలుగు రోజుల క్రితం ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ తీసుకొచ్చా. తేమ ఎక్కువ రావడంతో కొనుగోలు చేయడం లేదు. భారీ వర్షం పడడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. మళ్లీ ఎప్పుడు కొంటారో తెలియదు. వ్యవసాయ మార్కెట్లో గోదాంలు ఎక్కువ లేకపోవడంతో ఆరు బయటనే పంటను ఆరబోశా. అధికారులు కొనుగోళ్లు ప్రారంభించాలి. – గైక్వాడ్ రాజేశ్వర్, రైతు, జున్ని, ఇచ్చోడ

మక్కలు కొనుగోలు చేయాలి..
ఇంద్రవెల్లి, అక్టోబర్ 30 ః ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా మక్కలు కొనుగోలు చేయాలి. మక్కలు ఎప్పడు కొంటారోనని ఎదురు చూస్తున్నా. కేంద్రం ఏర్పాటు చేసినా రైతులకు ఏం లాభం లేక పోయింది. నాకున్న రెండెకరాల్లో మక్క వేసిన. 45 క్వింటాళ్ల దిగుబడి రావడంతో వారం రోజుల క్రితం యార్డుకు తీసుకొచ్చా. వర్షానికి తడవడంతో కొనుగోలు కేంద్రంలోనే అరబెడుతున్నా. జిల్లా అధికారులు పట్టించుకొని మక్క రైతులను ఆదుకోవాలి.
– రాథోడ్ దశరథ్, రైతు, బీక్కుతండా

 
                            