 
                                                            నవీ ముంబై : మహిళల ప్రపంచ కప్‌లో టీమిండియాను ఫైనల్లోకి తీసుకెళ్లిన జెమీమా రోడ్రిగ్స్‌పై ప్రశంసలు కురిపించింది ఆస్ట్రేలియా కెప్టెన్ అలెస్సా హీలే(Alyssa Healy). రోడ్రిగ్స్ ప్రదర్శించిన మానసిక తెగువ అసాధారణమైందన్నారు. సెమీస్‌లో నిజమైన ఆస్ట్రేలియన్ల తరహాలో తమ జట్టు ఆడలేకపోయినట్లు చెప్పిందామె. జెమీమా వన్డేల్లో మూడవ సెంచరీ నమోదు చేసింది. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో 127 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. జెమీమా అద్భుతమైన ఇనింగ్స్తో ఆసీస్ విసిరిన 339 రన్స్ టార్గెట్‌ను ఇండియా చేధించింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ కెప్టెన్ హీలే మాట్లాడుతూ.. చివరి నాలుగైదు ఓవర్ల వరకు కూడా ఆటలో పట్టు ఉందని, కానీ ఆ తర్వాత చేజారిందన్నారు. జెమీమా అద్భుతంగా ఆడినట్లు ఆమె కితాబు ఇచ్చింది. ప్రత్యర్థిపై వత్తిడి తేవడంలో జెమీమా సక్సెస్ అయినట్లు పేర్కొన్నది. జెమీమా ఈ మ్యాచ్‌లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నది. 82, 106 వ్యక్తిగత పరుగుల వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్‌లను ఆస్ట్రేలియన్లు వదిలేశారు. క్యాచ్‌లను వదిలేయడం వల్ల తమకు నష్టం జరిగిందని హీలే పేర్కొన్నది. కానీ జెమీమా చాలా అద్భుతంగా ఆడిందని, జట్టుకు విజయాన్ని అందించాలన్న మానసిక స్థైర్యంతో ఆమె ఇన్నింగ్స్ ను నిర్మించినట్లు చెప్పింది.
అసాధారణ రీతిలో తన మనోనిబ్బరాన్ని ప్రదర్శించినట్లు జెమీమాను హీలే పొగిడింది. ఆమెకు ఫుల్ క్రెడిల్ ఇస్తున్నట్లు చెప్పింది. డ్రాప్ క్యాచ్‌లతో మ్యాచ్ స్వరూపం మారిపోయినట్లు పేర్కొన్నది. సెమీఫైనల్ వత్తిడా లేక ఏకాగ్రత లేకపోవడమా, ఇంకేదైనా కారణం కావొచ్చు అని హీలే పేర్కొన్నది. ఆ పిచ్‌పై రాత్రి పూట బ్యాటింగ్ చాలా ఈజీగా మారినట్లు చెప్పింది. హర్మన్‌ప్రీత్, జెమీమా మధ్య ఏర్పడిన 167 పరుగుల భాగస్వామ్యం పట్లకు తనకు ఎటువంటి టెన్షన్ పుట్టలేదని, కానీ తమ బౌలర్లు సరైన సమయంలో వికెట్లు తీయలేకపోయినట్లు పేర్కొన్నది. హర్మన్, జెమీమా అద్భుతంగా ఆడారని, హర్మన్ ఆటలో పరిణితి ఉందని, ఆదివారం జరిగే ఫైనల్లో హర్మన్ రాణిస్తుందని హీలే ఆశాభావం వ్యక్తం చేసింది.
 
                            