– స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల భారీ విజయం
– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, డిసెంబర్ 15 : కోదాడ నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలవడంతో పాటు పరోక్షంగా బీఆర్ఎస్ సహకరించిన అభ్యర్థులే మెజారిటీగా విజయం సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి పరాభవం చవిచూపారని కోదాడ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం ముఖ్య నాయకులతో కలిసి కోదాడలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థుల్లో మూడవ వంతు ఓటమి పాలయ్యారని.. అందుకు సంబంధించి ఎమ్మెల్యే విడుదల చేసిన వీడియో క్లిప్పింగులే సాక్షిభూతమని గణాంకాలతో సహా వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పై ప్రజల విరక్తిని స్పష్టం చేస్తుందన్నారు.
ఇక మునగాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహస్యమైందని, ఓ అక్రమార్కుడిపై అతి సామాన్యుడైన శివాజీ గెలిచినప్పటికీ మంత్రి ఉత్తమ్ తన అధికారాన్ని అడ్డుపెట్టి రిటర్నింగ్ అధికారిపై ఒత్తిడి తెచ్చి ఓటమిపాలైనట్టుగా ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. ఈ అంశంలో న్యాయం జరిగేంత వరకు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని, కోర్టులోనూ తేల్చుకుంటామన్నారు. నీతి నిజాయితీలకు మారుపేరని చెప్పుకునే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అవినీతికి పాల్పడిన రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యే పై ధిక్కారస్వరం వినిపించి ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకుంటామని బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను బుజ్జగించి తిరిగి పార్టీ కండువాలు కప్పేందుకు సన్నద్ధం కావడం శోచనీయమన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను సర్పంచులుగా మెజారిటీగా గెలిపించినందుకు ఆయన నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కందిబండ సత్యనారాయణ, తొగరు రమేశ్, భూపాల్ రెడ్డి, ఎస్కే నయీమ్, శెట్టి సురేశ్, కర్ల సుందర్ బాబు, శోభారాణి, అభి, మాదాల ఉపేందర్ పాల్గొన్నారు.