నాలుగు శతాబ్దాల చరిత్ర… మినీ భారతం అనే ప్రశంస.. నలువైపులా విశాల అభివృద్ధి విస్తరణకు అనువైన డక్కన్ పీఠభూమితో భౌగోళిక హంగు.. బెస్ట్ లివబుల్ సిటీగా విశ్వనగర ఖ్యాతి.. ప్రపంచపటంలో ఇదీ హైదరాబాద్ మహా నగర ముఖచిత్రం.
మరి… ఇలాంటి ప్రముఖ మెట్రో నగరాన్ని పాలనాపరంగా విస్తరించాలంటే ఏం చేయాలి?! నెలల తరబడి మథనం చేయాలి… క్షేత్రస్థాయిలో అన్వేషణ సాగాలి… ప్రణాళికలో ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని పరిగణలోనికి తీసుకోవాలి… అవసరమైతే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికలను రూపొందించాలి… అంతర్జాతీయ కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలి. మూసీ పరీవాహకాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేందుకే అంతర్జాతీయ కన్సెల్టెన్సీలను పిలిచిన ప్రభుత్వం ఇది. చిన్నపాటి సర్వేలకు సైతం గ్లోబల్ టెండర్లతో జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెంట్లకు కోట్ల రూపాయలు ధారపోసిన గ్రేటర్ అధికార యంత్రాంగం ఇది.
దశాబ్దాల పాటు పాలనకు దిశా నిర్దేశంగా ఉండే హైదరాబాద్ మహా నగర విస్తరణ ప్రణాళికను నాలుగు గోడల మధ్య… అందునా టౌన్ ప్లానింగ్ అధికారులతో ముగించేశారు. గూగుల్ మ్యాపులను చూసి ప్రధాన రహదారులే హద్దులుగా గీతలతో చుట్టేశారు. సర్కారు పెద్దల నుంచి వచ్చిన 300 డివిజన్ల సంఖ్యను సంతృప్తిపరిచేందుకు అడ్డగోలుగా పునర్విభజన చేశారు. చివరకు బల్దియా అధికారులు గ్లోబల్ సిటీ ప్రతిష్ఠను దిగజార్చారు. అందుకే ఈ నిర్వాకం ఎక్కడ రట్టయి.. న్యాయపరమైన చిక్కులతో ప్రక్రియ నిలిచిపోతుందోనని హైకోర్టు ఆదేశించినా.. డివిజన్ల మ్యాపులను ప్రదర్శించలేదు. చట్టాన్ని అడ్డం పెట్టుకొని అరకొరగా సాగిన ప్రక్రియను దాచిపెట్టారు. మచ్చుకు రెండు డివిజన్ల పునర్విభజన తీరును చూస్తే అధికారులు ఎంత అధ్వానంగా బృహత్తర ప్రణాళికను రూపొందించారో అర్థమవుతుంది. హైకోర్టు ఆదేశానుసారం పిటీషనర్లకు ఇచ్చిన లంగర్‌హౌస్, శాలిబండ డివిజన్ మ్యాపుల్లో ఓటర్లు ఎంత మంది ఉన్నారో కూడా పొందుపరచలేకపోయారంటే కించిత్తు కసరత్తు కూడా అధికారులు చేయలేదని తేటతెల్లమవుతుంది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): యథా రాజా… తథా ప్రజా అన్నారు పెద్దలు! కాంగ్రెస్ ఏలుబడిలో యథా పాలకులు… తథా అధికారులు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. తెలంగాణ రాష్ర్టానికి ఆర్థిక గ్రోత్ ఇంజిన్ అయిన హైదరాబాద్ మహా నగరాభివృద్ధి గత రెండు సంవత్సరాలుగా మంచులో గడ్డకట్టినట్లుగా (ఫ్రీస్) అయిపోయింది. ఒక్కటంటే ఒక్క పాత ప్రాజెక్టు పూర్తి కాకపోగా.. ఒక్క కొత్త ప్రాజెక్టు శిలాఫలకం దాటి నేల మీదకు రాలేకపోయింది. కానీ సర్కారు పెద్దల ప్రసంగాల్లో మాత్రం హైదరాబాద్ అభివృద్ధి వర్తమానం శూన్యం… భవిష్యత్ ఘనం అన్నట్లుగా కనిపిస్తున్నది. 2047 విజన్‌తో ఇటీవల గ్లోబల్ వేదికగా హైదరాబాద్ ఖ్యాతిని వల్లెవేసిన ప్రభుత్వ పెద్దలు కీలకమైన నగర విస్తరణ ప్రణాళికను మాత్రం అత్యంత దయనీయంగా ముగించేశారు.
అవుటర్ రింగు రోడ్డు వరకు కోర్ హైదరాబాద్ అనే ఒక సూత్రాన్ని తీసుకొని నగర విస్తరణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గొప్పలు చెప్పుకొనేందుకు దేశంలోనే అతి పెద్ద హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థగా 625 చదరపు కిలోమీటర్ల నుంచి సుమారు 2700 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. కానీ ఊపర్ షేర్వానీ… అందర్ పరేషానీ… అన్నట్లుగా డివిజన్ల పునర్విభజన ప్రక్రియను మాత్రం అశాస్త్రీయంగా… అడ్డగోలుగా చేపట్టారు. నామమాత్రంగా అభ్యంతరాల స్వీకరణను ముగించి మమ అనిపిస్తున్నారు. పునర్విభజన ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశ వేదికగా అధికార, విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు పూసగుచ్చినట్లు వివరించినా కేవలం చట్టంలోని నిబంధనల్ని అడ్డం పెట్టుకొని అధికారులు లోసుగులను బుల్డోజ్ చేసి ముందుకుపోతున్నారు.
ఇదేనా గ్లోబల్ విజన్…?!

Buldings
కాంగ్రెస్ ప్రభుత్వం 2047 అంటూ గ్లోబల్ సమ్మిట్ వేదికగా విజన్ ప్రకటించింది. ఆచరణలో మాత్రం అసలు విజన్ అనేది నల్లపూస అనేందుకు గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ల పునర్విభజన ప్రక్రియనే ఓ ఉదాహరణ. గతంలో డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ సందర్భంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ వేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకున్నారు. అనేక నివేదికలను పరిశీలించి డివిజన్లలో జనాభా, ఓటర్ల మధ్య వ్యత్యాసం పది శాతం మించకుండా జాగ్రత్త పడ్డారు. ప్రధానంగా డివిజన్ల సరిహద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించారు. కానీ ఇప్పుడు ఉన్న 150 డివిజన్లను రెట్టింపు చేసేందుకు సిద్ధమైన అధికారులు కేవలం రోజుల వ్యవధిలోనే ప్రక్రియను ముగించడం వెనక పెద్ద ఎత్తున ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందులో రాజకీయ కోణాలున్నాయో! సర్కారు నిర్లిప్తతతో అధికారులే అడ్డగోలు విభజన చేపట్టారోగానీ గ్లోబల్ సిటీకి చేపట్టాల్సిన ప్రణాళిక ఇంత అధ్వాన్నంగా ఉంటుందా? అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పదేండ్లలోనూ హైదరాబాద్ మహా నగరంలో కీలకమైన ప్రక్రియలేమైనా చేపట్టే ముందు ప్రభుత్వాలు, అధికారులు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీలను రంగంలోకి దింపి శాస్త్రీయ అధ్యయనాలు చేపట్టారు. ఉదాహరణకు మెట్రో నిర్మాణానికి ముందు ఏకంగా ఆరు అంతర్జాతీయ కన్సల్టెన్సీలతో అధ్యయనం నిర్వహించారు. కానీ డివిజన్ల పునర్విభజన మాత్రం జీహెచ్ఎంసీ, చుట్టూ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలోని టౌన్‌ప్లానింగ్ అధికారులతో చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో.. చేతిలో ఉన్న సంస్థల సేవల్ని కూడా వినియోగించుకోలేదు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని సెంటర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ స్టడీస్, అందుబాటులో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ వంటి సంస్థల సేవల్ని తీసుకోలేదు.
గూగుల్ స్క్రీన్‌పై డివిజన్ల పునర్విభజన..
నగరంలోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో కేవలం సర్కారు పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే పరిగణలోనికి తీసుకొని నాలుగు గోడల మధ్య పని కానిచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు టౌన్‌ప్లానింగ్ అధికారులు గూగుల్ మ్యాపులో ప్రధాన రహదారులను ప్రాతిపదికగా చేసుకొని డివిజన్లను ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతకుముందే రాజకీయ కోణంలో కొన్ని ప్రాంతాల్లో ఎన్ని డివిజన్లు ఉండాలి? ఎలా విస్తరించాలి? అనే ప్రాథమిక వివరాలను పరిగణలోనికి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్ల మ్యాపులను ముసాయిదా సమయంలో ప్రదర్శించాలనే నిబంధన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని కేవలం సరిహద్దులను మాత్రమే ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరించారు.
కానీ వాస్తవానికి మ్యాపులను ముందుగా ప్రదర్శిస్తే అధికారుల నిర్వాకం బట్టబయలయ్యేది. అన్ని మ్యాపులను పక్కన చేరిస్తే సరిగ్గా గూగుల్ మ్యాపుల్లో ఇంపోజ్ చేయొచ్చని, దీంతో ఎంత అధ్వానంగా పునర్విభజన జరిగిందోనన్న నిర్వాకం బయటికొచ్చేదని ఓ అధికారి తెలిపారు. హైకోర్టు ఆదేశానుసారం ఇద్దరు పిటీషనర్లకు ఇచ్చిన శాలిబండ, లంగర్‌హౌస్ మ్యాపులను పరిశీలిస్తే ఈ ఆరోపణలన్నీ వాస్తవమేనని అర్థమవుతుంది. అంతేకాదు.. కనీసం డివిజన్లలో ఉన్న ఓటర్ల సంఖ్యను కూడా అందులో పేర్కొనలేదు. లంగర్‌హౌస్ (134) డివిజన్ పరిధిలో 50,484 జనాభా ఉంటే శాలిబండ (104) పరిధిలో 32,761 జనాభా ఉన్నారు. ఇవి బయటికొచ్చిన రెండు డివిజన్ల వివరాలే… 300 డివిజన్ల వివరాలు బయటికొస్తే ఇంకా ఎన్నో విచిత్ర అంశాలు బయటికొస్తాయనడంలో సందేహం లేదు.

100 శాతం వ్యత్యాసమే..
– పొన్న వెంకటరమణ, పిటీషనర్
గతంలోనూ జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ చేపట్టారు. కానీ ఆనాడు శాస్త్రీయ విధానాలు, జనాభా, హద్దుల నిర్ధారణ, నియోజకవర్గాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఇవాళ హడావుడిగా చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియతో ఒక్కో వార్డు మధ్య వ్యత్యాసం 100 శాతానికి పైగా ఉంది. ఒక్కో వార్డులో ఉండే జనాభా, పెరగనున్న జనాభాను కూడా లెక్కలోకి తీసుకోలేదు. గూగుల్ మ్యాప్‌ల ఆధారంగానే ప్రక్రియ చేపట్టినట్లుగా ఉంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా జరిగిన తప్పిదాలే… తాజా జీహెచ్ఎంసీ విలీనం, కొత్త వార్డుల ఏర్పాటులోనూ ఉంది. ఇక మ్యాపులను కూడా గూగుల్ నుంచి సేకరించినట్లు కొత్త డివిజన్ల మ్యాపులు ఉన్నాయంటే వార్డుల విభజన ఎంత దారుణంగా జరిగిందనేది అర్థం అవుతుంది.