ముంబై: స్వదేశం వేదికగా జరిగే ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత క్రికెట్ సైన్యం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగబోతున్న టీమ్ఇండియా పలు అనూహ్య మార్పులతో రాబోతున్నది. శనివారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన అజిత్ అగార్కర్ నేతృత్వంలో భేటీ అయిన సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ అంచనాలకు అందని నిర్ణయాలు తీసుకుంది.
భారత ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా భావిస్తున్న శుభ్మన్గిల్కు అనుకోని షాక్ ఎదురుకాగా, సూపర్ ఫామ్‌తో జార్ఖండ్‌ను తొలిసారి ముస్తాక్ అలీ టీ20 టోర్నీ విజేతగా నిలుపడంలో కీలకంగా వ్యవహరించిన ఇషాన్ కిషన్‌కు ఊహించని పిలుపు దక్కింది. సూపర్ ఫినిషర్‌గా అందరి మన్ననలు అందుకున్న యూపీ హార్డ్ హిట్టర్ రింకూసింగ్ పట్ల సెలెక్టర్లు నమ్మకాన్ని ఉంచారు. మరోవైపు వికెట్‌కీపర్, బ్యాటర్‌గా రాణిస్తున్న జితేశ్‌శర్మకు నిరాశ ఎదురుకాగా, సూపర్‌ఫామ్‌తో అలరిస్తున్న హైదరాబాదీ డాషింగ్ బ్యాటర్ తిలక్‌వర్మ తొలిసారి టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు. మొత్తంగా గిల్‌కు మొండిచేయి చూపించిన సెలెక్టర్లు ప్యాకెట్ డైనమైట్‌గా పిలుచుకునే ఇషాన్ కిషన్‌ను వికెట్‌కీపర్, టాపార్డర్ బ్యాటర్‌గా జట్టులోకి తీసుకున్నారు.
టీమ్ఇండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు పొట్టి ప్రపంచకప్‌లో బెర్తు దక్కలేదు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్‌లో గిల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 4, 0, 28 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఓవైపు అభిషేక్‌శర్మ ఆది నుంచే బౌలర్లపై విరుచుకుపడుతుంటే టెస్టులతో పాటు వన్డేల్లో రాణిస్తున్న గిల్ టీ20ల్లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. మొదట్లో వికెట్ చేజార్చుకుని జట్టుపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు.
వీటిని పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు టాపార్డర్‌లో వికెట్‌కీపర్, బ్యాటర్ అవసరాన్ని గమనించి సంజూ శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఫిట్నెస్, గాయాల కారణంగా ఈ ఏడాది టీమ్ఇండియాకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్..ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ టోర్నీలో సత్తాచాటాడు. సూపర్‌ఫామ్ కనబరుస్తూ జార్ఖండ్‌ను విజేతగా నిలుపడంలో కీలక భూమిక పోషించాడు. ఎక్కడ కోల్పోయాడో అక్కడే సాధించుకోవాలన్న పట్టుదలతో కసిగా ఆడి తిరిగి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ముస్తాక్ అలీ ఫైనల్లో ఇషాన్ చేసిన మెరుపు సెంచరీ..సెలెక్టర్ల దృష్టిని బాగా ఆకర్షించింది.
టీ20 ఫార్మాట్లో టీమ్ఇండియా తరఫున నిలకడగా రాణిస్తున్న హైదరాబాదీ తిలక్‌వర్మ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే తిలక్ తనదైన శైలిలో ఇన్నింగ్స్‌కు ఇరుసులా మారుతున్నాడు. సఫారీలతో ఆఖరి పోరులో దూకుడుతో పాటు సమయోచిత బ్యాటింగ్‌తో హార్దిక్ పాండ్యాతో కలిసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. దీనికి తోడు ఆసియాకప్ ఫైనల్లోనూ సహచర బ్యాటర్లు విఫలమైనా..ఒత్తిడి దరిచేరకుండా దాయాది పాకిస్థాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని జట్టును విజేతగా నిలుపడంలో తిలక్ విజయవంతమయ్యాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ ఆందోళన కల్గిస్తుండగా, శివమ్‌దూబే, హార్దిక్‌పాండ్యా, రింకూసింగ్‌తో బ్యాటింగ్ బలంగా ఉన్నది.
మెగాటోర్నీలో బౌలింగ్ దళానికి జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. అర్ష్‌దీప్‌సింగ్, హర్షిత్రానాతో కలిసి బుమ్రా పేస్ బాధ్యతలు పంచుకోనుండగా, కుల్దీప్యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ తంత్రంతో కట్టడి చేయనున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్‌పటేల్ ఎంపిక కాగా, శివమ్‌దూబే, రింకూసింగ్ ఫినిషర్లుగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు ఇదే జట్టు బరిలోకి దిగనుంది.
జట్టు వివరాలు : సూర్యకుమార్(కెప్టెన్), అభిషేక్‌శర్మ, తిలక్‌వర్మ, హార్దిక్‌పాండ్యా, శివవ్దూబే, అక్షర్‌పటేల్, కుల్దీప్యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్‌సింగ్, హర్షిత్రానా, శాంసన్, సుందర్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషణ్, రింకూసింగ్