మహబూబ్‌నగర్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్‌నగర్ జిల్లా వేములలో దళిత యువతిపై లైంగిక దాడి కేసులో గోప్యత పాటించిన పోలీసులు.. శనివారం నమస్తే తెలంగాణ పత్రికలో ఇటు ‘కాంగ్రెస్ జులూస్.. అటు గ్యాంగ్ రేప్’ శీర్షికతో కథనం వెలువడటంతో ఎట్టకేలకు స్పందించారు. మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి శనివారం మూసాపేటలో ప్రెస్‌మీట్ పెట్టి కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు విష్ణును మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. చిన్నచింతకుంట మండలం పల్లమర్రికి చెందిన విష్ణు తండ్రి తిరుపతయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య జయమ్మతో కలిసి వేములలో నివసిస్తున్నారు. పల్లమర్రిలో చిన్నభార్య ఉంటుంది. చిన్న భార్య కొడుకే విష్ణు .
వేములలో ఉండే తండ్రి వద్దకు విష్ణు తరచుగా వచ్చిపోతుండేవాడు. రెండేండ్ల క్రితం వేములకు వచ్చిన విష్ణుకు… యువతితో పరిచయం ఏర్పడింది. ఈ నెల 17న వేములకు వచ్చిన విష్ణు పిలిస్తేనే రాత్రి 8 గంటల సమయంలో రైతువేదిక వద్దకు యువతి వెళ్లింది. బాధితురాలిపై విష్ణు లైంగికదాడికి పాల్పడగా.. అపస్మారక స్థితికి చేరుకున్నది. నిందితుడు యువతి బంధువు భారతికి విషయం వివరించగా విష్ణు, భారతి కలిసి బాధితురాలిని రైతువేదిక పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రం ఆవరణకు తీసుకెళ్లి పడుకోబెట్టారు. బాధితురాలి బంధువు అరుణ్, అజయ్ సాయంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకొన్న యువతి తల్లిదండ్రులు స్థానిక వైద్యుల సూచనతో యువతిని జానంపేటలోని ప్రభుత్వ దవాఖానకు అంబులెన్స్‌లో తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారని వివరించారు.
బాధిత యువతి తల్లిదండ్రులు అదే రోజు రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. గ్యాంగ్‌రేప్ జరుగలేదని, ఒక్కడే ఉన్నట్టు తేలిందని తెలిపారు. ఎక్కువ మంది ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో తేలితే.. చార్జిషీట్లో చేరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్న తల్లిని తీసుకురావడానికి వెళ్లిన యువతిపై అఘాయిత్యం జరిగినట్టు ఎఫ్ఐఆర్లో ఉండగా, ఎస్పీ ప్రెస్మీట్లో విషయం ప్రస్తావించకపోవడంపై దళిత సంఘాలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి.