హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు చేసిన తొలి కుంభకోణం గుట్టు రట్టయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. సివిల్ సైప్లె డిపార్టుమెంట్లో జరిగిన కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్‌ను దోషిగా నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీయేనని తెలిపారు. గత 20 నెలలుగా సివిల్ సైప్లె శాఖలో జరిగిన అవినీతిపై బీఆర్ఎస్ సాగించిన పోరాటం ఫలించిందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2022-23లో గత సర్కారు హయాంలో కొనుగోలు చేసి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ముసుగులో కాంగ్రెస్ సర్కారులోని పెద్దలే బినామీలుగా ఉండి రూ.1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ అందుకు సంబంధించిన ఆధారాలు సహా కోర్టులో పిల్ వేసిందని చెప్పారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని 20 నెలల క్రితమే కోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వం కౌంటర్ వేయకుండా 18 సార్లు వాయిదా కోరిందని పేర్కొన్నారు. దీనినిబట్టే ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల ఆధారాలు సేకరించిందనే విషయం స్పష్టమవుతున్నదని తెలిపారు. కేంద్ర దర్యాపు సంస్థలైన ఈడీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్, రాష్ట్ర సంబంధిత విచారణ సంస్థలైన ఏసీబీ, రాష్ట్ర విజిలెన్స్ సంస్థలకు 755 పేజీల రాతపూర్వకమైన వివరాలతో కూడా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల కుంభకోణంలో బీఆర్ఎస్ పాక్షిక విజయం సాధించినట్టయిందని, కాంగ్రెస్ పెద్దలు అక్రమంగా తిన్న ప్రజల సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు.