బాగ నమ్మిస్తే మోసం జేయడం అల్కగైతది. నమ్మకమనేదే లేకుంటే మోసమనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతవో నమ్మకానికి నీడలాగా మోసం దానెంబడే ఉంటది. ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఎక్కువ ఎవరన్న ప్రయత్నం చేస్తే ఒకటికి రెండు సార్లు మనం జాగ్రత్తగా చూడాలె.
– ఓ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలివి
‘విద్యాశాఖకు 21 వేల కోట్లు కేటాయిస్తే, ఇందులో 98 శాతం టీచర్ల జీతాలకే ఖర్చవుతున్నది’ బుధవారం నిర్వహించిన ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలివి. అంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాలకు తప్ప పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూపాయి కూడా విదిల్చడం లేదని సీఎం చెప్పకనే చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): విద్యారంగానికి సంబంధించి తాము టీచర్ల జీతాల మట్టుకే నిధులు కేటాయిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా అంగీకరించారు. మరో విధంగా.. సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు రూపాయి కూడా విదిల్చడంలేదని సెలవిచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులను కేటాయిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. ఈ లెక్కన ఏటా రూ.40 వేల కోట్లను కేటాయించాలి. కానీ కేవలం రూ.21 వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నది. రేవంత్‌రెడ్డి సర్కారు నియమించిన విద్యాకమిషన్ సైతం రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 20 శాతం నిధులను కేటాయించాలని సిఫారసు చేసింది. దీనిని కూడా పాటించిన దాఖలాల్లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యకు 7.75 శాతం నిధులను అనగా రూ.21,389 కోట్లు మాత్రమే కేటాయించారు.
ఆ తర్వాత 2024-25 బడ్జెట్లో 7.31శాతం, 2025 -26లో 7.57 శాతం మాత్రమే బడ్జెట్‌ను కేటాయించించింది. టీచర్లకు ప్రతి నెల జీతాల చెల్లింపు అనివార్యం కాగా, అంతమేరకే నిధులు విడుదల చేస్తూ విద్యారంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం విస్మయం కలిగిస్తున్నదని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యాశాఖను తన వద్దనే ఉంచుకున్న ముఖ్యమంత్రి ఓ వైపు ఇస్తున్న నిధుల్లో 98 శాతం జీతాలకే పోతున్నదన్న వాస్తవాన్ని తానే వెల్లడిస్తూ.. మరోవైపు విద్యారంగానికి నిధులు ఇస్తున్నా అభివృద్ధి చెందడం లేదని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉన్నదని అంటున్నారు. సీఎం వ్యాఖ్యలపై టీచర్లు ఫైర్ అవుతున్నారు. ఇలా టీచర్లను అవమానించడం పరిపాటిగా మారిందని మండిపడుతున్నారు. నిధుల్లో 98 శాతం టీచర్ల జీతాలకే పోతున్నదంటే తాము జీతాలు తీసుకోకండా ఫ్రీగా పనిచేయాల్నా అంటూ ఓ టీచర్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో 26 వేల పైచిలుకు బడులున్నాయి. చాలా బడుల్లో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. తాజా వివరాల ప్రకారం 1,752 సర్కారు బడుల్లో బాలికలకు టాయిలెట్లు లేవు. మరో 1100 బడుల్లో టాయిలెట్లు ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితులున్నాయి. రాష్ట్రంలో 4,069 బడుల్లో టాయిలెట్లు లేవని ఇటీవలే విడుదలైన యూడైస్ నివేదిక తేల్చింది. మరో 1,400 బడుల్లో బాలురకు టాయిలెట్లు ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. నీటి కనెక్షన్ లేకపోవడంతో ఈ టాయిలెట్లను వినియోగించుకోలేని పరిస్థితులున్నాయి. రాష్ట్రంలో 1,255 స్కూళ్లకు కరెంట్ కనెక్షనే లేదు. 166 సర్కారు బడుల్లో తాగేందుకు నీళ్లు లేవు. ఎయిడెడ్‌లో 25 స్కూళ్లలో నీటికి కటకట నెలకొన్నది. ఈ పరిస్థితులిలా ఉంటే బడ్జెట్లో రూ.21 వేల కోట్లు కేటాయిస్తే ఎట్లా అని టీచర్ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విద్యకు రాబోయే బడ్జెట్లో రూ.40 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. అందులో టీచర్ల జీతాలకు 50 శాతం పోతే మిగిలిన 50 శాతం నిధులతో బడులను బాగుచేసుకోవచ్చని సూచిస్తున్నాయి.
గురుకులాల్లోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను సర్కారు కుదించింది. జేఎల్‌కు 35 వేల నుంచి 23,400కు, పీజీటీలకు 31,395 నుంచి 18,200కు, టీజీటీలకు 28,660 నుంచి 18,200కు తగ్గించింది. టీచర్ల జీతాన్ని పెంచాల్సింది పోయి అడ్డంగా తెగ్గోసి అవమానించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ కత్తి దూసింది. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారికి చెల్లించే వేతనాల్లో కోత విధించింది. ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్నవారి కంటే తక్కువ స్థాయికి పాఠాలు బోధించే టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు), పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు) వేతనాలను కుదించింది. ఈ మేరకు వేతనాలను సవరిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ చర్యలపై గురుకులాల్లోని ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ నిప్పులు చెరుగుతున్నారు.
తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీలో 204 గురుకులాలు ఉన్నాయి. వాటిలో రెగ్యులర్ సిబ్బంది కాకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 3,756 మందిని నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అందులో టీచింగ్ విభాగంలో ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), టీజీటీ, పీజీటీ పోస్టులున్నాయి. నాన్‌టీచింగ్ విభాగంలో డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులున్నారు. గతంలో జేఎల్‌కు రూ.35 వేలు, పీజీటీ, టీజీటీలకు రూ.27వేల వేతనం చెల్లించేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి సైతం రెగ్యులర్ సిబ్బందికి చెల్లించిన తరహలో 30% పీఆర్సీని వర్తింపజేసింది. క్రమం తప్పకుండా కంటిన్యుయేషన్ ఆర్డర్స్ ఇస్తూ వచ్చింది.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది కొనసాగింపునకు సంబంధించి ఆర్డర్స్‌ను గత రెండు నెలలుగా ఇవ్వలేదు. దీంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేతనాలను విడుదల చేయలేదు. దీంతో సొసైటీలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు.. ‘బతికెదెట్లా?’ అంటూ ఇటీవల ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా సొసైటీలోని సిబ్బంది వేతనాల్లో కోత విధించింది. గత ఏప్రిల్ నుంచి 2026 మార్చి 21 వరకు ఉపాధ్యాయులను, అధ్యాపకులను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తాజాగా 16న జీవో ఆర్టీ నంబర్ 1437 పేరుతో ఉత్తర్వులు జారీచేసింది. అయితే అదే ఉత్తర్వుల్లో వేతనాల విషయంలో మాత్రం భారీ కోతలు పెట్టింది. జేఎల్ వేతనాన్ని రూ.35 వేల నుంచి రూ.23,400కు కుదించింది. ఒక్కసారిగా ఏకంగా రూ.11,600 వేతనాన్ని కోసేసింది.
పీజీటీల వేతనాన్ని రూ.31,395 నుంచి రూ.18,200కు, టీజీటీల వేతనాన్ని రూ.28,660 నుంచి రూ.18,200కు తగ్గించింది. మొత్తంగా 1,227 జేఎల్, 435 పీజీటీ, 108 టీజీటీల వేతనాన్ని కోసేసింది. అదేవిధంగా ఔట్సోర్సింగ్ విభాగంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కుక్‌లు, కంప్యూటర్ టీచర్లు, పీడీలు, పీఈటీలు, తదితర సిబ్బంది వేతనాలను సైతం భారీగా తగ్గించింది. ఒక్కో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగికి సగటును రూ.5వేల నుంచి రూ.13వేల వరకు కోత విధించింది. ఉన్నతాధికారుల వద్ద, కార్యాలయంలో పనిచేసే డ్రైవర్ల వేతనం 19,500 కాగా, విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్న టీజీటీ, పీజీటీల వేతనాన్ని రూ.18,200గా నిర్ధారించారు. ప్రభుత్వం నిర్ణయంపై ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం తీరుపై ఇదేనా ప్రజాపాలన? అంటూ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం మైనార్టీ గురుకులాలపై ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇతర గురుకులాలతో పోలిస్తే మైనార్టీ గురుకులాల్లో పనిచేసే జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు వేతనాలు అదనంగా ఉండటం వల్ల సదరు సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో పనిచేస్తూ విద్యార్థులకు బోధన అందించారు. కానీ, సర్కారు తాజా నిర్ణయం వల్ల తగినంత వేతనాలు అందే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో బోధన విషయంలో అంకితభావం కొరపడుతుందని, తద్వారా ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళన బాట పట్డేందుకు సదరు అధ్యాపకులు, ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు.
మైనార్టీ గురుకుల సొసైటీలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి సంబంధించి రెండు నెలల వేతన బకాయిలను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వేతనాల కోసం వారు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. వేతనాలను విడుదల చేసింది. అయితే గతం కంటే భారీగా వేతనాల్లో కోత విధించింది.
మైనార్టీ గురుకులాల్లోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల కోత విషయం తనకేమీ తెలియదని సొసైటీ సెక్రటరీ షఫియుల్లా జావాబిస్తుండటం గమనార్హం. వేతనాల కోత నేపథ్యంలో గురుకుల సిబ్బందితో జూమ్ మీటింగ్ నిర్వహించారని తెలిసింది. ఈ సమావేశంలో సెక్రటరీ షఫియుల్లా స్పందిస్తూ.. వేతనాల్లో కోత విషయం తన దృష్టికే రాలేదని చెప్పినట్టు సొసైటీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ప్రస్తుత ఉత్తర్వులను సవరిస్తారనే భరోసా కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే సెక్రటరీకి తెలియకుండా ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఎలా వెళ్లాయని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిదే సొసైటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో మైనార్టీతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలు సైతం ఉన్నాయి. ఇతర గురుకులాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న జేఎల్‌కు రూ.27వేలు, టీజీటీ, పీజీటీలకు రూ.24వేలు, పీడీలకు, ఆర్ట్, మ్యూజిక్ టీచర్లకు రూ.20వేల చొప్పున చెల్లిస్తున్నారు. మైనార్టీ గురుకుల సొసైటీ తరహాలోనే తమకు సైతం వేతనాలు ఇవ్వాలని మిగతా సొసైటీల్లోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎన్నికల ముందు గాంధీభవన్‌కు వెళ్లి ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సైతం వినతిపత్రం అందజేశారు. ప్రజాపాలనలో న్యాయం చేస్తామని, 12 నెలలకు మినిమం టైమ్సేల్ను ఇస్తామని, జాబ్ సెక్యూరిటీ కల్పిస్తామని, జేఎల్‌కు రూ.42 వేల జీతం చెల్లిస్తామని హామీ ఇవ్వడమేకాదు, ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పొందుపరిచింది. కానీ ఆ హామీ సంగతేమో కానీ మైనార్టీ గురుకులాల్లోని నాన్‌రెగ్యులర్ ఉద్యోగుల వేతనాల్లోనే కోత విధించడం గమనార్హం. గత ప్రభుత్వం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను పెంచుతూ రావడమేగాక, పీఆర్సీనీ సైతం వర్తింపజేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందించే అత్తెసరు వేతనాల్లోనే భారీగా కోత విధించింది. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నది. ఇప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను జీవో-1284 పేరిట రోడ్డున పడేసింది.
ఆయిల్‌ఫెడ్.. ఇది వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధీనంలో ఉన్న శాఖ. కానీ, సదరు మంత్రికి తెలియకుండానే ఆయిల్‌ఫెడ్ ఎండీ శంకరయ్యను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసి కొత్త ఎండీగా జితేందర్‌రెడ్డిని నియమించింది. ఎవరిని నియమిస్తున్నారనే అంశంపై సంబంధిత మంత్రికి కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని వ్యవసాయ శాఖలో చర్చనడుస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): అధికారుల బదిలీల్లో భాగంగా ఆయిల్‌ఫెడ్ ఎండీ శంకరయ్యను బదిలీ చేసిన ప్రభుత్వం కొత్త ఎండీగా జితేందర్‌రెడ్డిని నియమించింది. అయితే ఇదంతా కూడా ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలియకుండానే జరిగిపోయినట్టు సమాచారం. ఎవరిని నియమిస్తున్నారనే అంశంపై మంత్రికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదనే చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా జరుగుతున్నది. మూడు నెలల క్రితం శంకరయ్య నియామకం సైతం మంత్రికి తెలియకుండానే జరిగి నట్టు తెలిసింది. అప్పుడు, ఇప్పుడు ఓ కీలక విభాగంలో కీలక అధికారి మార్పు, కొత్త అధికారి నియామకంపై ఆ శాఖ మంత్రికే సమాచారం ఇవ్వకుండా, ఆయన అభిప్రాయం తీసుకోకుండానే జరిగిపోవడంపై విస్మయం వ్యక్తమవుతున్నది.
వాస్తవానికి శంకరయ్య పనితీరుపై మంత్రి తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. సాధారణంగానే ఆయిల్‌పామ్ సాగుపై మంత్రి తుమ్మల ప్రత్యేకదృష్టి సారించారు. ఆయనకు సుమారు 200 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆలోచనలకు, భవిష్యత్ ప్రణాళికకు తగ్గట్టు శంకరయ్య పనిచేయడం లేదని భావించేవారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సందర్భంలో ప్రస్తావించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్‌ను కూడా సీఎం రేవంత్‌రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎరేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టు ఆయనను భ్రమల్లో ముంచారు. ఇంతవరకు బాగానే ఉన్నా గత ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తున్న సమయంలో అజారుద్దీన్ ఎంపికను గవర్నర్ ఆమోదించే పరిస్థితే లేదు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ఆ పార్టీ నేతకు మొండి చెయ్యి చూపనున్నదా? జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరి నుంచి తప్పించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎత్తువేశారా? అక్కడి ముస్లిం ఓట్లకోసమే ఈ డ్రామాకు తెరతీశారా? అనే ప్రశ్నలకు న్యాయ, రాజకీయ నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఎందుకంటే ఆయనతో పాటు కోదండరాం ఎంపిక రాజ్యాంగ విధానాలకు వ్యతిరకమనే వాదన వినిపిస్తున్నది. గతంలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎంపిక చెల్లదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రు సత్యనారాయణ ఎంపిక కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది. వారికి రాజకీయ నేపథ్యమున్నందున ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అమీర్‌అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌ను నామినేట్ చేస్తూ గవర్నర్ వద్దకు పంపించారు.
అమీర్‌అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌తో పాటు కోదండరాంను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ఆగస్టు 30న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. గతంలో రాజకీయ నేపథ్యమున్నదనే కారణంతో దాసోజు శ్రవణ్, కుర్రు సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని 2024 జనవరి 17న అప్పటి గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ తిరస్కరించారు. దీనిపై వీరు హైకోర్టుకు వెళ్లారు. అయినా గవర్నర్ ఆమోదించలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ అమీర్‌అలీఖాన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. దీనిపై దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టుకు వెళ్లగా వారి ఎన్నిక చెల్లదని, తుదీతీర్పు అనంతరం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
రాజకీయ నేపథ్యం, మ్యాచ్ ఫిక్సింగ్, హెచ్‌సీఏలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజారుద్దీన్‌కు కూడా ఎమ్మెల్సీగా చుక్కెదురు తప్పదని న్యాయకోవిదులు చెప్తున్నారు. ఆయ న యూపీలో మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అలాగే కోదండరాం కూడా తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి ఎంపిక సుప్రీంకోర్టులో నిలబడడం అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. ఈ కారణంగానే గవర్నర్ ఈ ఫైల్‌ను 20 రోజులుగా పెండింగ్‌లో పెట్టారని అంటున్నారు.
మరో రెండు, మూడు నెలల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో లబ్ధిపొందేందుకే సీఎం రేవంత్‌రెడ్డి అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా ప్రతిపాదించినట్టు అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అక్కడ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్టు తెలిసింది. అంతేగాని అజారుద్దీన్‌పై ప్రేమతోకాదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. గతంలో షబ్బీర్‌అలీని నిజామాబాద్ నుంచి పోటీ చేయించి.. నమ్మించి గోంతుకోశారని, అమీర్అలీఖాన్ను కూడా ఇదే తరహాలో మోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అజారుద్దీన్‌కు మొండి చెయ్యి చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన అజారుద్దీన్ ఉప ఎన్నికల్లో తిరిగి బరిలో నిలువాలని భావిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం ఆయనను ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయనకే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వడం ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆయనను ఎమ్మెల్సీగా ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్టు చెప్తున్నారు. అవసరమైతే ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తామంటూ ఆశచూపారని పేర్కొంటున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ సర్కారును నమ్మి మోసపోయామని కాలేజీల యాజమాన్యాలు మథన పడుతున్నాయి. సోమవారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం అసలు విషయం చెప్పకుండా యాజమాన్యాలు చెప్పిన రూ. 1,207 కోట్లే బకాయి ఉన్నట్టు నటించింది. కానీ ఆ విలువ రూ.3,543 కోట్లు అని తెలిసి యాజమాన్యాలు అవక్కయ్యాయి. అసలు లెక్కలను దాచి ప్రభుత్వం తమను వంచించిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఇంత మోసముంటదా? ఇంత దగానా? మొత్తం వివరాలను బయటపెడతామన్నారు.. కానీ కప్పిపుచ్చారు. నమ్మిన వారిని నట్టేట ముంచిన్రా? ఇది ఏ ఇద్దరు కాలేజీ యజమానులు కలిసినా మాట్లాడుకుంటున్న మాటలు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని కాలేజీల నిర్వాహకులు చెప్తున్నారు. ఆసలు విషయాన్ని ఆలస్యంగా గ్రహించి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మితే ఇంత మోసం చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ కాలేజీల యజమాన్యాలు ఏకతాటిపైకి వచ్చి.. నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాలేజీలను మూసివేస్తామని తేల్చిచెప్పడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. మొదట ఓ సారి చర్చలకు పిలిచింది. ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత రెండో దశ చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల్లోనూ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క.. అర్థం చేసుకోవాలని కోరారు. అల్లరి చేస్తే మీకే నష్టం అంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యాజమాన్యాల సంఘం ప్రతినిధులు మెత్తబడి.. మొత్తం కాకున్నా.. ఏడాది క్రితం టోకెన్లు జారీచేసిన మేరకు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించారు. ఇంత వరకు బకాయిలను చెల్లించలేదని తెలిపారు. అవి చెల్లించినా సమ్మెకు వెళ్లబోమని తెలిపారు.
టోకెన్లు జారీ అయ్యి.. విడుదల కానీ బకాయిలు ఎంత ఉంటాయని ప్రభుత్వం ఆరా తీయగా.. రూ.1,207 కోట్లుంటాయని కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు చెప్పారు. అయితే మీరు చెప్పింది నమ్మలేం. అంత ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ వద్దనే లెక్కలుంటాయి.. అసలెంతో మీరేం తేల్చండి అని యాజమాన్యాలు కోరగా, ఆదివారం సెలవు కావడంతో సోమవారం చెప్తామని ప్రభుత్వం బదులిచ్చింది. పైగా పెండింగ్ బకాయిలెంత? టోకెన్లు జారీ అయి విడుదలకానివి ఎంత? అన్న వివరాలను బహిర్గతం చేస్తామని తెలిపింది. అంతటితో చర్చలకు బ్రేక్‌పడింది.
సర్కారు లెక్కలు తీసిన తర్వాత టోకెన్లు జారీ అయిన బకాయిల విలువ రూ.3,543 కోట్లుగా తేలింది. అంటే యాజమాన్యాలు చెప్పినదాని కంటే రెండు రెట్లు అధికం. ఈ వివరాలను సర్కారు బయటపెట్టలేదు. సోమవారం జరిగిన చర్చలో టోకెన్లు జారీ అయిన బకాయిలెంత? అన్నది చెప్పలేదు. యాజమన్యాలు చెప్పిన రూ.1,207 కోట్లే ఉన్నట్టు పేర్కొంది. వీటిలో రూ.600 కోట్లు ఇస్తామన్నది. వీటిని కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన యాజమాన్యాలు నివ్వెరపోతున్నాయి. సర్కారును నమ్మి మోసపోయామని తలలు పట్టుకుంటున్నారు.
ఇన్నాళ్లూ జీహెచ్ఎంసీలో రూ.24000 జీతానికి పనిచేసిన కొందరు సిబ్బందిని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాలో పడేసింది. బాధ్యతలు పెంచిన తర్వాత ఆ స్థాయిలో జీతాలను కూడా పెంచాల్సింది పోయి విచిత్రంగా రూ.19,500కు కుదించింది. జీహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ప్రతినెలా 5వ తేదీలోగా వేతనాలు అందేవని, ఇప్పుడు 15, 20, 25 తేదీల్లో వేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తమకు జీతాలు తగ్గించి పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తూ హైడ్రా సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. జీతంలో రూ.5 వేలు కట్ చేశారంటూ 1100 మంది ఉద్యోగులు బుధవారం ఉదయం విధులు బహిష్కరించి నెక్లెస్‌రోడ్డులోని బుద్ధభవన్ వద్ద హైడ్రా కార్యాలయ ఎదుట ఆందోళన చేపట్టారు. రాత్రిపగలు తమతో పనులు చేయించుకుని ఇప్పుడు వేతనం తగ్గించడంపై డీఆర్ఎఫ్ బృందాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. న్యాయం జరగకుంటే విధులకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒకేలా జీతాలు అందేలా జీవో తెచ్చింది. ఈ జీవో కారణంగా తమ వేతనంలో రూ. 5 వేలు కోతపడిందని డీఆర్ఎఫ్ సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సిబ్బంది మెరుపు ధర్నాతో హైడ్రా సేవలు స్తంభించిపోయాయి.-హైదరాబాద్ సిటీబ్యూరో