వేల్పూర్, సెప్టెంబర్ 17 : రాష్ట్రంలో యరియా కొరత రోజురోజుకు తీవ్రమవుతుంటే కాంగ్రెస్, బీజేపీలు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్యెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో వేముల విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి 16 మంది ఎంపీలు ఉన్నారని.. రైతులకు ఇబ్బంది పడుతుంటే ఎంపీలు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజలకు ఉపయోగపడని పదవులు ఎందుకని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసమర్థ పాలకులు, కాంగ్రెస్ ఎంపీలకు ప్రధాని మోదీని నిలదీసే ధైర్యం ఎందుకు లేదని వేముల ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డిని తిడుతున్నా.. శాపనార్థాలు పెడుతున్నా కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీకి మూటలు పంపడం తప్ప వేరే ధ్యాస లేదని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలో
ఫుల్లుగా ఎరువులు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, కేసీఆర్ దూరదృష్టి గల పాలన.. రైతులకు స్వర్ణ యుగంగా మారిందని చెప్పారు. కేసీఆర్ ముందుగానే లెక్కలు వేసి, మంత్రుల బృందాన్ని కేంద్రం వద్దకు పంపి, యూరియా తెప్పించే వారని గుర్తుచేశారు.