Sampath Kumar | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరిచే వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ కొన్ని కలుపు మొక్కలు, గంజాయి మొక్కలు ఉన్నాయి, వాటిని ఏరి పారేయాలి అని సంపత్ కుమార్ అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉందని అర్థమైంది. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించామని ఏమాత్రం అదమరిచి వ్యవహరించినా ఆగమైపోతాం. ఈ మంచి వాతావరణాన్ని సమిష్టి కృషిని ఇదే అదునుగా చేసుకుని పార్టీని ప్రభుత్వాన్ని అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అంటున్నాను. ఐదేండ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో రెండేండ్లు పూర్తయింది. చివరి ఏడాదంతా ఎన్నికల హడావుడి ఉంటుంది అని సంపత్ కుమార్ పేర్కొన్నారు.
ఎన్ఎస్యూఐ కార్యకర్త నుంచి ఏఐసీసీ కార్యకర్త వరకు, ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవంతో సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీని సమన్వయ పరిచే విషయంలో అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రక్షాళన చేసే క్రమంలో పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. పనితీరులో ఎవరు ఏ మేరకు సఫలీకృతులయ్యారో బేరీజు వేసుకోని ప్రక్షాళన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అనేక శక్తులను కూడగట్టుకోవాలని ఆ రోజు అనేక మంది వచ్చారు. ఈరోజు అనేక స్థాయిల్లో పని చేశారు. కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా.. చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తగా చెబుతున్నా. ఆనాడు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఉప్పెనలా వచ్చిన ప్రభంజనంలో గెలుస్తామని, అధికారంలోకి వస్తామని వచ్చిన వాళ్లు ఉన్నారు. రేపు రెండు మూడేండ్ల తర్వాత పరిస్థితులు మారితే వారు ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ మేం అయితే పార్టీలోనే ఉంటాం కాబట్టి, వీటన్నింటినీ బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాం. అందరి పనితీరుపై అన్ని స్థాయిల్లో పరిశీలన జరగాలి. ప్రతి ఒక్కరి పనితీరును పునఃపరిశీలించి ప్రక్షాళన చేయాలని కోరుతున్నానని సంపత్ కుమార్ పేర్కొన్నారు.