Colon Cleaning Foods | మనం తినే ఆహారాలు లేదా తాగే ద్రవాలు ఏవైనా సరే ముందుగా జీర్ణాశయంలో జీర్ణం అవుతాయి. అనంతరం అక్కడి నుంచి ఆహారం చిన్న పేగులకు చేరుతుంది. చిన్న పేగుల్లో ఆహారంలో ఉండే పోషకాలను శరీరం శోషించుకుంటుంది. అక్కడ పోషకాలు పోగా మిగిలిన ఆహారం మలంగా మారుతుంది. అనంతరం అక్కడి నుంచి ఆ మలం పెద్ద పేగు ద్వారా బయటకు వస్తుంది. ఇలా జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది. అయితే ఆహార వ్యర్థాలను బయటకు పంపే పెద్ద పేగు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అందులో ఎలాంటి వ్యర్థాలు పేరుకుపోకూడదు. అలా పేరుకుపోతే మనకు అనేక వ్యాధులు వస్తాయి. పెద్ద పేగులో వ్యర్థాలు పేరుకుపోతే శరీరం విష తుల్యంగా మారుతుంది. దీంతో అనేక రోగాల బారిన పడాల్సి వస్తుంది. కనుక పెద్ద పేగును ఎల్లప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను పలు ఆహారాలు మనకు ఎంతో దోహదం చేస్తాయి. వాటిని రోజూ తీసుకుంటే పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
పెద్ద పేగు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. ఫైబర్ వల్ల మలం గట్టిగా మారకుండా ఉంటుంది. దీంతో అది పెద్ద పేగు నుంచి సులభంగా బయటకు వస్తుంది. కనుక పెద్ద పేగు ఆరోగ్యం కోసం ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఫైబర్ మనకు తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు ఓట్స్, పప్పు దినుసులు, శనగలు, బార్లీ వంటి ఆహారాల్లో లభిస్తుంది. కనుక వీటిని రోజూ తీసుకోవాలి. బ్రౌన్ రైస్, బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలను తింటున్నా కూడా ఫైబర్‌ను పొందవచ్చు. అలాగే ప్రొ బయోటిక్ ఆహారాలను తీసుకుంటుంటే పెద్ద పేగుకు ఎంతో మేలు జరుగుతుంది. పెరుగు, మజ్జిగ, పులియ బెట్టిన ఆహారాలు, పాలు ఈ జాబితాకు చెందుతాయి. కనుక వీటిని తీసుకుంటుంటే పెద్ద పేగు ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రొ బయోటిక్ ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా పెద్ద పేగులో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీని వల్ల పెద్ద పేగు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పెద్ద పేగు శుభ్రంగా ఉండాలంటే రోజూ నీళ్లను తగిన మోతాదులో తాగాలి. నీళ్లను తగినంతగా తాగకపోతే పెద్ద పేగులో వ్యర్థాలు అలాగే ఉండి అవి పేరుకుపోతాయి. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక నీళ్లను తగినంత మోతాదులో తాగాల్సి ఉంటుంది. పుచ్చకాయలు, తర్బూజాలు, కీరదోస, స్ట్రాబెర్రీలు వంటి పండ్లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటి వల్ల పెద్ద పేగు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది.
తరచూ వివిధ రకాల సూప్‌లను ఆహారంలో భాగం చేసుకున్నా మేలు జరుగుతుంది. సూప్‌లను సేవిస్తుంటే శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా పెద్ద పేగు శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోజూ రెండు పూటలా భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసం సేవించాలి. ఇది కూడా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పొట్ట, పేగుల్లో ఉండే వాపులను తగ్గిస్తుంది. వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది. భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తింటున్నా ఉపయోగం ఉంటుంది. ఇవి ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తాయి. వ్యర్థాలను సులభంగా బయటకు పంపిస్తాయి. రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కలబంద రసాన్ని సేవిస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద పేగు శుభ్రమయ్యేలా చేస్తుంది. ఇలా ఆయా ఆహారాలను తీసుకుంటుంటే పెద్ద పేగును శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రోగాలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.