Imprisonment | అగర్తలా : ఆరేండ్ల క్రితం ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. త్రిపుర ఖోవాయి జిల్లాలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన సమీర్ కురీ.. ఆరేండ్ల క్రితం అభం శుభం తెలియని ఓ చిన్నారిపై కామంతో చెలరేగిపోయాడు. ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడు సమీర్‌ను జైలుకు తరలించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం సమీర్ బాలికపై అత్యాచారం చేసినట్లు తేలింది. శనివారం ఖోవాయి జిల్లా సెషన్స్ జడ్జి వీపీ దెబ్బర్మా కీలక తీర్పు వెలువరించారు. సమీర్ కురీకి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 50 వేల జరిమానా విధించారు. జరిమానా విధించడంలో విఫలమైతే.. మరో ఆరు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తీర్పులో పేర్కొన్నారు.
అయితే 2019లో బాలికపై అత్యాచారం జరగ్గా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం పోలీసులు కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం నిందితుడికి జైలు శిక్ష విధించినట్లు త్రిపుర పోలీసు అధికారి రాజ్‌దీప్ దేబ్ ఒక ప్రకటనలో తెలిపారు.