Collagen Production | కొల్లాజెన్ అనేది మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ఒక ముఖ్యమైన నిర్మాణ ప్రోటీన్. చర్మం, ఎముకలు, స్నాయువులు, మృదులాస్థి, రక్తనాళాలకు బలం, సాగే గుణాన్ని, నిర్మాణ మద్దతును అందించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. గ్లైసిన్, ప్రోలిన్, హైడ్రాక్సీప్రోలిన్ వంటి అమైనో ఆమ్లాలతో తయారవుతుంది. చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేయడంలో, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను బలంగా తయారు చేయడంలో, గాయాలు త్వరగా మానడంలో కొల్లాజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మంది యవ్వనంగా కనిపించడానికి, చర్మంపై ముడతలు రాకుండా ఉండడానికి కొల్లాజెన్ సప్లిమెంట్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే వయసు పైబడే కొద్ది కొల్లాజెన్ ఉత్పత్తి కూడా తగ్గుతూ ఉంటుంది. అయితే సప్లిమెంట్స్ పై ఆధారపడే అవసరం లేకుండా సహజంగా లభించే ఆహారాల ద్వారా కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచకోవచ్చు. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే చిట్కాల గురించి, సహజ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. సిట్రస్ పండ్లు, ఉసిరి, బెర్రీలు, కివి, బెల్ పెప్పర్ వంటి పండ్లను తీసుకోవడం వల్ల ఆమైనో యాసిడ్లు కొల్లాజెన్ గా మారతాయి. వాతావరణ కాలుష్యం, ఎండ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడడంలో కొల్లాజెన్ ఎంతో సహాయపడుతుంది. గుడ్లు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, చేపలు, లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా కొల్లాజెన్ ఉత్పత్తిని సహజంగా పెంచుకోవచ్చు. అలాగే జింక్, రాగి వంటి ఖనిజాలు కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. గింజలు, నట్స్, హోల్ గ్రెయిన్స్, కోకోవా, సెల్ఫిష్ వంటి ఆహారాల్లో ఈ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అంతేకాకుండా చర్మానికి ఎక్కువగా యూవీ కిరణాలు తాకడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. కనుక బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ వాడడం, చర్మానికి నేరుగా ఎండ తగలకుండా కప్పుకోవడం వంటివి చేయాలి. ఇక శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. నీరు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచదు కానీ చర్మ కణాలకు పోషకాలు సరిగ్గా అందేలా చేయడంలో, కొల్లాజెన్ పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. నీరు తాగడం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. అదే విధంగా తగినంత నిద్ర కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందని చెప్పవచ్చు. నిద్రించడం వల్ల శరీరం కొల్లాజెన్ మరమ్మత్తు చేయడంతో పాటు పునరుత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా తగినంత నిద్రించడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఒత్తిడి కారణంగా కొల్లాజెన్ నష్టం జరగకుండా ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి నెమ్మదిస్తుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకోవాలి. నడక, శ్వాస వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా చర్మం, కీళ్ల కణజాలలు విచ్చినం అవ్వకుండా ఉంటాయి.
అధిక చక్కెరలను తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఫైబర్ లు దెబ్బతింటాయి. కనుక చక్కెర అధికంగా ఉండే ఆహారాలను, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ను తీసుకోవడం తగ్గించాలి. దీని వల్ల అకాల వృద్దాప్యం రాకుండా ఉంటుంది. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పొట్ట ఆరోగ్యంగా ఉండడం వల్ల పోషకాలు ఎక్కువగా గ్రహించబడతాయి. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. కనుక సమతుల్య ఆహారాన్ని, కూరగాయలను, పండ్లను, పులియబెట్టిన ఆహారాలను ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా తగిన ఆహారాలను తీసుకుంటూ, ఒత్తిడి అదుపులో ఉండేలా చూసుకుంటూ, చక్కటి జీవనశైలిని పాటించడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా చర్మం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.