నగరంలో ఎక్కడ కొత్త రోడ్డు వేసినా సరే.. వారు వెంటనే అక్కడ వాలిపోతారు.. రోడ్డు పడుతున్న సమయంలో కూల్చివేసిన ఇళ్ల ర్యాంపులను మళ్లీ కడుతామంటూ యజమానులను సంప్రదిస్తారు. ఎంతో కొంత తక్కువ మొత్తంలో పని పూర్తి చేస్తామంటూ చెప్పి ఒక రేటు మాట్లాడుకుంటారు. అడ్వాన్సు తీసుకున్న తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఇవాళ రేపు అంటూ రోజుల తరబడి కాలం గడిపేస్తారు కానీ పని మాత్రం మొదలుపెట్టరు. ఇదేంటంటే తమకు రేటు పడడం లేదని కొందరు, ఇచ్చిన అడ్వాన్స్ సరిపోలేదని మరికొందరు.. ఇలా ఏదో ఒక కారణం చెప్పి పని చేయడం లేదు. అయితే వాళ్లు తీసుకుంటున్న అడ్వాన్సులు పదివేల లోపే ఉండడంతో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ)
నగరశివారులోని సుచిత్ర ప్రాంతంలో ఒక కాలనీలో ర్యాంప్ కేటుగాళ్లు 42 ఇండ్లకు టోకరా వేశారు. అక్కడ కొత్త రోడ్డు పడుతున్న సమయంలో ఇండ్ల యజమానుల దగ్గరకు వచ్చి ర్యాంప్ వేస్తామని అడిగారు. ఎంతకు వేస్తారని అడిగితే పది నుంచి పదిహేను వేల మధ్య రేటు మాట్లాడుకున్నారు. ఒక ఇంటి దగ్గర మొదలైన ఈ వ్యవహారం ఆ వీధి అంతా నడిచింది. అటు నుంచి పక్కవీధిలో కూడా అదే రోజు మరో గ్యాంగు కూడా ఇదే తరహాలో ర్యాంప్ వేస్తామంటూ మాట్లాడుకుని అడ్వాన్సులు తీసుకున్నారు. ప్రతీ ఒక్క ఇంటి నుంచి రూ. 2 వేల నుంచి రూ. 5వేలు కొందరి దగ్గరైతే రూ.7వేల వరకు వసూలు చేసినట్లు ఇంటి యజమానులు చెబుతున్నారు. అయితే అడ్వాన్సులు ఇచ్చిన తర్వాత మెటీరియల్ తేవాలంటూ ఒక రోజు, వర్కర్లు దొరకడం లేదంటూ మరొక రోజు.. ఇలా కాలయాపన చేస్తూ సుమారు నెల రోజుల తర్వాత ర్యాంప్ ఎందుకు వేయడం లేదంటూ నిలదీసిన యజమానులకు తమ రేటు పడడం లేదని చెప్పారు.
దీంతో యజమానులు తమ అడ్వాన్సులు అడిగితే ఇచ్చేది లేదని, మీకు దిక్కున్న చోట చెప్పుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆ యజమానులు చెప్పారు. ఇటువంటి గ్యాంగులు సిటీ మొత్తంలో పది నుంచి పదిహేను ఉన్నాయని తెలిపారు. వీరంతా అడ్వాన్సుల పేరుతో డబ్బులు దండుకుని తిరిగి ఇవ్వకుండా ఫోన్ చేస్తే పెద్దగా పట్టించుకోకపోవడంతో ఒకరిద్దరు తమకు తెలిసిన పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కూడా ఈ చిన్నదానికి ఫిర్యాదులు అవసరమా అని చెప్పారని, పోలీసు స్టేషన్కు వెళ్తే వారిని పిలిచి మాట్లాడతామని చెప్పి యజమానులను పంపించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ దందాకు సంబంధించిన వ్యవహారమంతా పోలీసులకు ఖచ్చితంగా తెలుసని, ర్యాంపు కేటుగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు సహకరించక పోవడానికి కేవలం ఆ కేటుగాళ్లు కొందరు స్థానిక ఖాకీలను మేనేజ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఒక కాలనీలో మోసం చేసి పోయిన తర్వాత కూడా ర్యాంపు దందా చేస్తున్న వాళ్లు మరో కాలనీలో కూడా ఇదే రకంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమైంది. నగరంలో చాలా చోట్ల కొత్త రోడ్లు పడుతుంటే ఇదే తరహాలో మోసాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం వారివైపే చూడడం లేదనే విమర్శలున్నాయి. అయితే కేటుగాళ్లు తమ ఫోన్లకు డబ్బులు పంపించమని అడుగుతూ యూపీఐ లావాదేవీలు చేస్తూ సాక్ష్యాధారాలతో సహా ఉన్నప్పటికీ ఏ మాత్రం భయపడకుండా ఉల్టా యజమానులకే చుక్కలు చూపిస్తున్నారని వారు వాపోతున్నారు. వీరంతా ఆంధ్ర ప్రాంతం తో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన వారు కావడంతో చాలా సమస్యలు వస్తున్నాయని వారు చెప్పారు. ఇంత చిన్న మొత్తాలకు పోలీసు స్టేషన్ వరకు వచ్చి ఫిర్యాదులు చేసి మా సమయం వృథాచేయకుండా మీకు మీరే సెటిల్ చేసుకోమని ఉచిత సలహా ఇస్తున్నారని యజమానులు చెప్పా రు. ఒక్కొక్కరి దగ్గర కొంత మొత్తంలో వసూలు చేస్తున్నట్లు కనిపించినా ఒక కాలనీలో రోడ్లు వేసే దగ్గర వందల ఇండ్లకు ర్యాంపులు వేస్తామని తీసుకుంటున్న మొత్తం లక్షలకు చేరుతుందని, ఈ విషయంలో పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.