పోక్సో కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేవిధంగా చట్టం కఠినంగా ఉంటే… పోలీసులు మాత్రం ఆ చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని… అయిన వారికి ఒక రకంగా…కానీ వారికి మరో రకంగా అమలు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. వారి అసమర్థత, లాలూచీ వైఖరి ప్రదర్శిస్తూ నిందితులకు ఊడిగం చేస్తున్నరని సామాన్య ప్రజలు విమర్శిస్తున్నారు. అధికార, ధనబలం ఉంటే ఎంతటి ఘోర నేరానికి పాల్పడినా చట్టం నుంచి సులువుగా తప్పించుకోవచ్చనే సంకేతాలను పోలీసులు స్వయంగా ఇస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసులో నిందితుడైన వ్యక్తి గతంలో టీడీపీలో యాక్టివ్‌గా పనిచేసిన ఓ రాజకీయ నేపథ్యం ఉండడంతో అవన్నీ ఇప్పుడు అతడికి కలిసొస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఆర్సీపురం పీఎస్ పరిధిలో ఓ ఆలయం వద్ద పనిచేసే 60 ఏండ్ల వృద్ధుడు ఆలయం వద్దకు వచ్చే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఫిర్యాదుపై గత నెల 14న కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాయిల్‌పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై లైంగిక దాడికి పాల్పడింది ఒక్కరే కాదని మరో ముగ్గురు రవియాదవ్, వీరభద్రస్వామి, కరికె సత్యనారాయణ కూడా ఉన్నారంటూ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మిగతా ముగ్గురిని కూడా నిందితులుగా చేర్చిన పోలీసులు రవి, వీరభద్రస్వామిలను సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే కరికె సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సత్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. నెల రోజులుగా ముందస్తు ప్రయత్నాలు సాగిస్తున్నాడు.
నిందితుడు గతంలో టీడీపీలో యాక్టివ్‌గా ఉండడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు, వారి అనుచరులతో పరిచయాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే భారీగా డబ్బు వెదజల్లి పోలీసులు తన వద్దకు రాకుండా చూసుకుంటున్నాడంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు… పోలీసులకు చిక్కడం లేదా..? కావాలని పట్టుకోవడం లేదా? అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. తనకున్న ధన బలంతో వ్యవస్థను నిందితుడు కొన్నాడని, ఈ క్రమంలోనే కావాల్సిన సమయాన్ని పోలీసులు ఇస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో స్థానిక ప్రజలు భిన్న రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇదే అంశం సోషల్‌మీడియాలోనూ చర్చకు దారితీస్తోంది. నెల రోజులుగా నాటకీయ పరిణామాల మధ్య నిందితుడు అజ్ఞాతంలో ఉన్నాడంటూ పోలీసులు చెబుతున్నారని ఇదంతా మాటలకే పరిమితమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడంతో అక్కడ బెయిల్‌పై వచ్చే ఫలితాలను బట్టి పోలీసులు నడుచుకుంటున్నారని, దీంతో నిందితుడిని.. పట్టుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
రాజకీయ, ధన బలం ముందు చట్టం తన పనిచేసుకోవడంలో పక్కకు వెళ్తుందనే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు ఘటనలే ప్రధాన నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ రెండు ఘటనలలో నిందితుల అరెస్ట్ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం రాజకీయ నేపథ్యం ఉండడం, పరోక్ష సహకారం అందుతుందనే ఆరోపణలు సైతం విన్పిస్తున్నాయి. గతంలో పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన బంగి భగరీథ్ పోక్సో కేసులోను పోలీసులు వ్యవహరించిన తీరు, పోలీసుల అసమర్థతపై బహిరంగంగా అప్పట్లో చర్చకు దారి తీసింది. నిందితుడి తండ్రికి ఉన్న రాజకీయ పలుకుబడికి తలొగ్గి కేసు నమోదు చేయకుండా అడ్డంకులు సృష్టించడం, ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురయ్యే వరకు వేచి చూడడం, ఆ తర్వాత అరెస్ట్ విషయంలోనూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం బహిరంగ రహస్యమే.
నేడు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న నిందితుడు సత్యనారాయణను అరెస్ట్ చేయడంలోనూ ఆర్సీపురం పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుడికి కావాల్సిన సమయం ఇచ్చేందుకు భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయంటూ స్థానిక ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పోలీసులు తలచుకుంటే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసేవాళ్లని, స్థానిక ప్రజలు అనుమానిస్తున్నట్లు భారీ ఎత్తున్న ఒప్పందాలు జరగడంతోనే నిందితుడికి కావాల్సిన సమయం ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు తక్షణ న్యాయం అందించాల్సిన పోలీసులు నిందితులకు రక్షణ కవచంగా మారి చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ.. పలువురు పోలీసుల తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికైనా ఆర్సీపురంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సత్యనారాయణను అరెస్ట్ చేసి పోలీస్ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలంటూ.. ప్రజలు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో పోలీసులు బాధితుల పక్షాన నిలుస్తున్నారా? నిందితుల పక్షాన నిలుస్తున్నారా? అంటూ స్థానిక ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది.