న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ వోక్స్వ్యాగన్ చేపట్టిన భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా తమ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షేలో మరో 4,100 ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉన్నట్లు జర్మన్ వ్యాపార దినపత్రిక ‘హ్యాండెల్స్ బ్లాట్’ వెల్లడించింది. ఇప్పటికే వేలాది ఉద్యోగాల కోతకు సంబంధించిన ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. చైనాలో అమ్మకాలు తగ్గడం, ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహంలో ఎదురైన ఇబ్బందులు, లాభాల అంచనాలు తగ్గడం వంటి పరిణామాల నేపథ్యంలో వోక్స్వ్యాగన్ పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతోంది.