స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో అమ్మకాల ఒత్తిడి తప్పడం లేదు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం సెన్సెక్స్ 486.80 పాయింట్లు నష్టపోయి 74,294.96 దగ్గర ఆగింది. నిఫ్టీ 51.70 పాయింట్లు పడిపోయి 23,346.40 వద్ద నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఒడిదుడుకులకు వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటడం, సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు, రష్యా నుంచి చమురు కొంటున్న భారత్‌పై అమెరికా 100 శాతం సుంకాలు వేస్తామంటుండటం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే అంశాలే.
ఇక చమురు, ఐటీ, బ్యాంకింగ్ తదితర రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్ నినో సంబంధిత సమాచారం కూడా మార్కెట్ కదలికల్ని ప్రభావితం చేయగలవు. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,100 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,700-23,900 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న వివరాలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.