PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు బయల్దేరారు. ఆయన ఇజ్రాయెల్‌లో రెండు రోజలపాటు పర్యటిస్తారు. దీనికోసం బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఇజ్రాయెల్ బయల్దేరారు. ఇది ప్రధానిగా ఇజ్రాయెల్‌కు రెండో పర్యటన. చివరగా 2017లో మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది.
ఈ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమవుతారు. ఇది నెతన్యాహు ఆహ్వానం మేరకు సాగుతున్న పర్యటన. రక్షణ, వ్యవసాయం, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, వ్యాపారం, పెట్టుబడులు, వాటర్ మేనేజ్మెంట్, కల్చరల్ ఎక్స్ఛేంజ్ వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి. గాజా యుద్ధం, శాంతి స్థాపన వంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి. ప్రధాని మోదీ పర్యటన కోసం ఇజ్రాయెల్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. అక్కడి మీడియా కూడా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. స్థానిక ప్రధాన పత్రిక ది జెరూసలెం పోస్ట్.. నమస్తే షాలోమ్ అంటూ మోదీ పర్యటన గురించి మొదటి పేజీ కథనం రాసింది. అది కూడా నమస్తే అంటూ హిందీలో, షాలోమ్ అంటూ స్థానిక హిబ్రూలో ప్రచురించింది. షాలోమ్ అంటే శాంతి అని అర్థం. దీనిద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాల్ని ఆ పత్రిక గొప్పగా వర్ణించింది.
ఇప్పటికే బయల్దేరిన మోదీ.. సాయంత్రం నాలుగు గంటలకు అక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనలో ప్రధాని అక్కడి పార్లమెంట్ అయిన కెనెసెట్‌లో ప్రసంగిస్తారు. మోదీ అక్కడ ప్రసంగించనుండటం ఇది మొదటిసారి. ఇజ్రాయెల్‌లో 41 వేల మంది భారతీయులున్నారు. వారితో ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.