Heart Health | సాధారణ కంటి పరీక్ష సైతం ఓ వ్యక్తి గుండె ఆరోగ్యంపై కీలక సంకేతాలను ఇస్తుందని తేలింది. కెనడాలో నిర్వహించిన పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. రెటీనాలోని చిన్న రక్తనాళాలను ప్రత్యేక స్కాన్లతో పరిశీలిస్తే, శరీర మొత్తం రక్తనాళ వ్యవస్థ పరిస్థితి, శరీరం ఎంత వేగంగా జీవ సంబంధమైన వృద్ధాప్యం స్థితిని అంచనా వేయవచ్చని తేల్చారు. ఈ పరిశోధన వివరాలు ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో వెల్లడయ్యాయి.
మెక్‌మాస్టర్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మేరీ పిగెర్ వివరిస్తూ.. ‘మన రక్తప్రసరణ వ్యవస్థను బయట నుంచి నేరుగా గమనించడానికి అవకాశం ఇచ్చే ఏకైక భాగం కంటి రెటీనా. అక్కడ కనిపించే నాళాల్లో మార్పులు, శరీరంలోని ఇతర సూక్ష్మ నాళాల పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తాయి’ అని తెలిపారు. అధ్యయనం కోసం 74,000 మందికి పైగా వ్యక్తుల రెటీనా చిత్రాలు, వారి జన్యు వివరాలు, రక్త నమూనాలు విశ్లేషించారు. రక్తనాళాల శాఖలు తక్కువగా, సూటిగా కనిపించే రెటీనా నిర్మాణం ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటమే కాకుండా, వృద్ధాప్య ఛాయలు కూడా వేగంగా కనిపించినట్లు గుర్తించారు. ప్రస్తుతం గుండె సమస్యలు, స్ట్రోక్, డిమెన్షియా వంటి వయస్సుతో పెరిగే వ్యాధులను గుర్తించడానికి పలు పరీక్షలు అవసరం అవుతాయి.
కానీ భవిష్యత్‌లో ఒక్క రెటీనా స్కాన్‌తోనే ఈ రిస్క్‌ను త్వరగా అంచనా వేసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే దీన్ని వైద్యపరంగా పూర్తిగా ఉపయోగించే ముందు మరిన్ని పరిశోధనలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే, రక్తంలో ఉన్న బయోమార్కర్ల విశ్లేషణలో రెటీనా నాళాల్లో మార్పులకు కారణమవుతున్న రెండు ప్రధాన ప్రోటీన్లు కూడా గుర్తించారు. ఎంఎంపీ12 (MMP12), ఐజీజీ-ఎఫ్‌సీ రిసెస్టార్2బీ (IgG-Fc Receptor 2B) అనే ఈ ప్రోటీన్లు వాపు, రక్తనాళాల వృద్ధాప్యాన్ని పెంచుతాయని తేలింది. ఈ సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ మేరీ పిగెర్ మాట్లాడుతూ.. ఈ సమాచారంతో రక్తనాళాల వృద్ధాప్యాన్ని తగ్గించే కొత్త ఔషధాల అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని.. గుండె సంబంధిత వ్యాధుల భారాన్ని కూడా తగ్గించగలుగుతామన్నారు.