ఆమెకు పుస్తకాలంటే ఇష్టం. చదవడం అంటే ప్రాణం. ఏదో నచ్చిన పుస్తకం చదివేసి వదిలేసే మనస్తత్వం కాదు ఆమెది. తను చదివిన మంచి విషయాన్ని పదిమందితో పంచుకోవాలని భావించింది. అంతేకాదు ఆ పుస్తకంపై తన అభిప్రాయాన్ని నేరుగా దాన్ని రాసిన రచయితకు చెప్పుకొంటే భలేగా ఉంటుంది కదా! అనుకుంది. ఆ తపనలో నుంచి పుట్టిందే ‘ఆథర్ మీటర్’ కాన్సెప్ట్. ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టినామె దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి కాదు! ఇరవై ఏండ్ల వయసున్న హైదరాబాదీ యువతి. స్మార్ట్ దునియాలో, రీల్స్ చుట్టూ కొట్టుమిట్టాడుతున్న ఈ తరానికి చెందిన బిస్వరూప బారిక్ తన చుట్టూ ఉన్నవాళ్లకు పుస్తక పఠనాన్ని చేరువ చేస్తున్నది. ఆఫ్‌లైన్ క్లబ్ స్థాపించి రచయితలకు, పాఠకులకు వారధిగా నిలుస్తున్న బిస్వరూపను జిందగీ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నాకు పుస్తకంతో స్నేహం ఏర్పడటానికి ప్రధాన కారణం మా అమ్మ. తను ఉపాధ్యాయురాలు. దాంతో క్రమశిక్షణ మా ఇంటి చిరునామాగా మారిపోయింది. ఖాళీ సమయం దొరికితే పుస్తకం చేతికి ఇచ్చేది. అలా నాకు పఠనాసక్తి కలిగింది. మేం ఉండేది హైదరాబాద్‌లోనే కాబట్టి కావాల్సిన పుస్తకాలన్నీ ఇట్టే దొరికిపోయేవి. పని గట్టుకొని మరీ బుక్ స్టాల్స్ చుట్టూ తిరిగేదాన్ని. మొదట్లో ఒక్కదాన్నే బుక్స్ చదివేదాన్ని. కొన్ని రోజులకు నేను చదివిన పుస్తకంలోని విషయాలు ఎవరితోనైనా పంచుకుంటే బాగుంటుంది కదా! అన్న ఆలోచన మొదలైంది. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ల గురించి తెలుసుకున్నాను. ప్రతీ ఆదివారం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో పుస్తకాలు చదువుతుంటారని విన్నాను. నేను కూడా వాళ్లలో ఒకదానిగా చేరి క్రమం తప్పకుండా పుస్తకాలను చదవడం… అందులోని విషయాలు పంచుకోవడం చేసేదాన్ని. కానీ, సికింద్రాబాద్‌లో ఉండే నేను ప్రతి ఆదివారం కేబీఆర్ పార్క్ వరకు వెళ్లడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అందుకే మా ఏరియాలోనే రీడింగ్ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలనుకున్నాను. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యపడలేదు.
పరిస్థితులు అనుకూలించకపోయినా రీడింగ్ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. చాలామంది ఓ పది నిమిషాలు పుస్తకం పట్టుకోగానే అలసిపోతుంటారు. బుక్ పక్కన పెట్టేసి ఫోన్ పట్టుకుంటారు! అదేమిటో కానీ, ఫోన్ చేతిలోకి రాగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. గంటల తరబడి దానికి అతుక్కుపోతారు. అలాంటి వ్యక్తులు చాలామంది ఎదురయ్యారు నాకు. ఏదేమైనా రీడింగ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి పుస్తకాలు చదివే అలవాటును బతికించాలనుకున్నా! ఆ సమయంలోనే పఠనాసక్తి ఉన్న నా స్నేహితుడు ఖాద్రితో కలిసి ఆఫ్‌లైన్ క్లబ్ ఏర్పాటు చేశాను. నా దృష్టిలో బుక్ రీడింగ్ మంచి ఫిట్నెస్ మంత్రం. మంచి పుస్తకం చదివితే మనసుకు కావాల్సినంత వ్యాయామం అవుతుంది. ఫోన్లలో మునిగిపోతున్న నగరవాసులకు పుస్తక పఠనంతో ఆరోగ్యాన్ని అందివ్వాలన్నదే మా క్లబ్ ధ్యేయంగా పెట్టుకున్నాం. అలా 2024లో ‘ఆఫ్‌లైన్ క్లబ్’ ప్రారంభించాను. ఇందులో ప్రతివారం ‘ఆథర్ మీటర్’ పేరుతో పుస్తక పఠనం, పుస్తక రచయితతో పాఠకుల ముఖాముఖి నిర్వహిస్తున్నాం.
‘ఆథర్ మీటర్’ ప్రారంభించి ఏడాదైంది. అందరినీ ఒక్క తాటిపైకి తేవడానికి కాస్త సమయం పట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఉండే పుస్తకప్రియులందరు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమానికి హాజరవుతుంటారు. వారిలో ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు, వ్యాపారులు ఇలా భిన్న వర్గాలకు చెందినవారు ఉన్నారు. ప్రతి ఆదివారం అనుకూలంగా ఉన్న ఒక కెఫేలో ఆథర్ మీటర్‌ను నిర్వహిస్తాం. మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తున్నామో తెలియపరుస్తాం. కొందరు రచయితలు మా క్లబ్ గురించి తెలుసుకొని వచ్చారు. మరికొంతమందిని మేమే సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్లంతా వచ్చి తమ పుస్తకాలను మాకిచ్చి చదివిస్తారు. ఆ తర్వాత పుస్తకంలో రచయిత భావాలను, వారి వ్యక్తిగత విషయాలను మేమంతా అడిగి తెలుసుకుంటాం. ఆ విషయాలన్నిటినీ వాళ్లు సవివరంగా తెలియజేస్తారు. మొదట్లో పాఠకుల సంఖ్య పరిమితంగా ఉండేది. నెమ్మదిగా ఆ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం వంద మంది వరకు వస్తున్నారు. గత నెల టాలీవుడ్ నటుడు ప్రియదర్శి వాళ్ల భార్య రాసిన ‘ఫైండింగ్ హోమ్ అగైన్’ అనే పుస్తకాన్ని మా క్లబ్‌లోనే పరిచయం చేశారు.
‘ఆథర్ మీటర్’లో పాల్గొనే పాఠకుల అభిప్రాయం మేరకే పుస్తకాల ఎంపిక ఉంటుంది. భాష కూడా వారి ఎంపికే. ఎక్కువగా ఐటీ ఉద్యోగులు ఉంటారు కాబట్టి ఇప్పటివరకు ఇంగ్లిష్ సాహిత్యాన్ని పరిచయం చేశాం. దానితోపాటు తెలుగు బుక్స్‌ను ప్రమోట్ చేస్తున్నాం. వారంలో ఒక్కరోజైనా ఫోన్లు పక్కన పెట్టేసి… పుస్తకం పట్టాలన్నదే నా అభిలాష. రచయితలను పాఠకుల ముందుకు తీసుకురావడంలో సఫలీకృతం అయ్యాననే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మా రీడింగ్ క్లబ్ కార్యక్రమాలు దేశంలోని ప్రముఖ పట్టణాలకు విస్తరించే యోచనలో ఉన్నాను. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా. ఇప్పటికైతే నేనింకా పాఠకురాలినే! రచయితల వేదికగా నిలిచిన ‘ఆథర్ మీటర్’ ద్వారానే నేనూ రచయితగా పరిచయం అవ్వాలనుకుంటున్నా! నా ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందని నమ్ముతున్నా!
నిజానికి చాలామందికి పుస్తకాలు చదవాలనే కోరిక సహజంగానే ఉంటుంది. కానీ, ఎలాంటి పుస్తకాలు చదవాలనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. మరోవైపు యువ రచయితలు ప్రజెంట్ జనరేషన్‌కు తగ్గట్టు రచనలు చేస్తున్నా… వాటిని ప్రమోట్ చేయడంలో వెనుకపడుతున్నారు. మా ఆథర్ మీటర్ వేదిక రీడర్‌కు, రైటర్‌కు మధ్య వారధిలా పనిచేస్తున్నది. పుస్తకం చదువుతున్న సందర్భంలో ఆ రచయితను కలుసుకొని పాఠకులు తమ అభిప్రాయాలు చెప్పాలనుకుంటారు. సాంకేతికత ఎంత పెరిగినా కూడా నేరుగా మనిషిని కలిసి తన ఫీలింగ్‌ను చెప్పడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుంది కదా! అందుకే రచయితతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. మా ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. మా క్లబ్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న కమ్యూనిటీ రీడింగ్ గ్రూప్ సభ్యులు కూడా మా బృందంలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవాళ్లు మా ఇన్‌స్టా పేజీ (Ofline Club Hyderabad) ద్వారా సంప్రదించవచ్చు.
– రాజు పిల్లనగోయిన