ఎడపల్లి : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాదులో గల నల్ల పోచమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈనెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.
మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, అలంకారాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, ప్రతిరోజు అన్నప్రసాద వితరణ చేశారు. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
డప్పుల మోత, మంగళ వాయిద్యాల నాదంతో అమ్మవారిని గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లి భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. పాత ఆలయం దెబ్బతినడంతో భక్తుల సహకారంతో నూతన ఆలయ నిర్మాణం పూర్తి చేసి పునఃప్రతిష్టాపన చేయడం ఆనందదాయకమని తెలిపారు. అమ్మవారి కటాక్షంతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.