భారతదేశానికి స్వాతంత్య్రం రాగానే అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ దేశంలో అప్పటిదాకా స్వతంత్రంగా ఉన్న అనేక రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడు. దాదాపు 562 సంస్థానాలను భరణం ఇచ్చి, బెదిరించి, బతిమిలాడి-అనేక రకాలుగా విజయం సాధించిన సర్దార్కు రెండు పెద్ద రాష్ర్టాలు సవాలుగా నిలిచాయి. అవే కశ్మీర్, హైదరాబాద్. ఈ రెండింటి మధ్య ఒక తేడా ఉంది. హైదరాబాద్ రాష్ట్రంలో హిందువులు 90 %, ముస్లింలు 10 % మంది ఉండగా, పాలకుడు మాత్రం ముస్లిం. కశ్మీర్లో ముస్లింలు 90 %, హిందువులు 10 % మంది ఉండగా, పాలకుడు హిందువు. మొదట్లో అప్పటి రాజు హరిసింగ్ ఇండియాతో గాని, పాకిస్థాన్‌తో గాని కలవకుండా స్వతంత్రంగా ఉండాలని భావించాడు. కానీ, అక్కడ జరిగిన గిరిజన దండయాత్రకు పాకిస్థాన్ సహాయం చేసేటప్పటికి భయపడి, 1947 అక్టోబర్‌లో ఇండియాలో తన రాజ్యాన్ని విలీనం చేశాడు. అయితే వారికి ముస్లిం పక్షపాతి నెహ్రూ చాలా రక్షణలు- ఇతర భారతీయులు వారి రాష్ర్టాన్ని ఆక్రమించకుండా హామీ ఇచ్చి, ప్రత్యేకంగా 370 బిల్లును రూపొందించి సత్కరించాడు.
అదే నెహ్రూ హిందువులు ఎక్కువగా ఉండి, కశ్మీర్ కంటే పెద్దదైన హైదరాబాద్ దేశాన్ని మాత్రం మిలిటరీ బలంతో, మోసంతో, ఏ రకమైన రక్షణలు కల్పించకుండా భారతదేశంలో విలీనం చేశాడు. ఆ మిలిటరీ వారి అరాచకాల కింద 1948 సెప్టెంబర్ నుంచి 1952 మార్చి దాకా తెలంగాణ ప్రజలు దారుణమైన కష్టాలు అనుభవించారు. 50,000 మంది సైనికుల్లో అప్పుడు మద్రాసు రెజిమెంట్‌లో ఉన్న ఆంధ్రవారు కూడా ఉన్నారు. వారు మిగతావారు చేసిన దారుణాల్లో పాలుపంచుకోవడమే కాకుండా, ఇక్కడ తమ స్థలాలు వదిలేసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన వారి స్థలాలు, ఇళ్లు కబ్జాచేసి ఇక్కడే స్థిరపడిపోయారు. ఈ రకంగా 1952లో స్థానిక ప్రభుత్వం ఏర్పడేలోపే కొందరు ఆంధ్రవారు, భారతదేశానికి చెందిన ముస్లింలు తెలంగాణలో స్థిరపడిపోయారు.
చాలామందికి తెలియని విషయం ఏమంటే.. ఈ భారతీయ ముస్లింలు తెలంగాణ ముస్లింలతో కలవలేకపోయారు. ఉన్నత సంస్కారం కలిగిన స్థానిక ముస్లింలు మొదట్లో ఈ వలస ముస్లింలకు దూరంగానే ఉండేవారు. వారి మధ్య పెండిళ్లు జరిగేవి కావు. సామాజిక సంబంధాలు కూడా ఉండేవి కావు. మతం ఒక్కటైనా సంస్కారం ఒక్కటి కాదు కదా!
ఈ సంస్థానాల విలీనంతో భారతదేశంలో రాష్ర్టాలకు ఎల్లలు ఏర్పర్చి, ఒక పద్ధతి ప్రకారం దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద పడింది. అప్పటికే వివిధ ప్రాంతాల్లో వారి స్థానిక భాషలు, తమ సాహిత్యాలతో సహా పరిపుష్టంగా తయారవడంతో భాషా ప్రాతిపదికన రాష్ర్టాలను ఏర్పర్చాలని అప్పటి ప్రధాని నెహ్రూ భావించాడు. ఈ ప్రకటనను 1953, డిసెంబర్ 22న పార్లమెంట్లో చేశాడు. 1953, డిసెంబర్ 23న సంబంధిత కమిషన్ ఏర్పడింది. అప్పుడు ఒరిస్సా గవర్నర్‌గా ఉన్న సయ్యద్ ఫజల్ అలీ చైర్మన్ గానూ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో సభ్యుడిగా ఉన్న హృదయనాథ్ కుంజ్రూ, ఈజిప్ట్‌లో భారత రాయబారిగా ఉన్న మాధవ ఫణిక్కర్ సభ్యులుగానూ 1953, డిసెంబర్ 29న త్రిసభ్య కమిషన్ ఏర్పడింది. దాన్నే రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిటీ అంటా రు (స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్-ఎస్ఆర్సీ).
ఈ కమిషన్ తన విధి విధానాలను రూపొందించుకుంటూ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పింది. ఒక రాష్ట్ర ప్రతిపత్తిని నిర్ణయించడానికి భాషనే కాకుండా, ఆ ప్రాంత సంస్కృతిని, ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, చారిత్రక అంశాలను కూడా గమనించాలని కమిషన్ నిర్ణయించింది. దాదాపు వెయ్యేండ్ల తర్వాత సంపూర్ణ స్వాతంత్య్రం పొందిన దేశంలోని రాష్ర్టాన్ని, మరో దేశంగా విలసిల్లిన తెలంగాణ ప్రాంతంతో కలపటానికి ఎంతో విశాల భావనలతో కమిషన్ ఇచ్చిన సిఫారసు ఏమిటో, దానికి వ్యతిరేకంగా నెహ్రూ రెండు రాష్ర్టాలను ఎలా కలిపాడో తెలుసుకుంటే విస్తుపోవాల్సిందే!
రెండు ప్రాంతాల ప్రజలు తమ నివేదికలు, అభ్యర్థనలు సమర్పించుకోవటానికి 1954, ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 24 దాకా ఫజల్ అలీ కమిషన్ గడువు ఇచ్చింది. సుమారు 2 వేల అభ్యర్థనలను పరిశీలిస్తూనే, 1954, జూన్ 29 నుంచి కమిషన్ తన విచారణను ప్రారంభించింది. రాజకీయ పార్టీల నాయకులు, సంస్థల అధిపతులు చాలామంది కమిషన్ ముందు తమ వాదనలు వినిపించారు. ఆంధ్ర ఉద్యమ యోధులందరూ కలిసి విశాలాంధ్ర వాదనలు వినిపించారు.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని కోరుతూ కమిషన్‌ను కలిసినవారిలో కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగరావు, హరిశ్చంద్ర హెడా, అరిగె రామస్వామి మొదలైనవారు ఉన్నారు. వీరు నిజాం రాష్ట్రంలో శతాబ్దాల తరబడి ఉన్న ఇతర ప్రాంతాలను కూడా, వారు తెలుగువారు కాకపోయినా, తెలంగాణలోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కమిషన్ సభ్యులు రాజ్‌భవన్‌కు వెళ్లి నిజాంను కూడా కలిసి చర్చించారు. హైదరాబాద్‌లోనే కలపాలని ఆంధ్రవారు చెప్పగా, ఆంధ్రులతో కలిసి ఉండటానికి తెలంగాణవారిలో ఒక్కరూ ఆమోదించకపోవడంతో ఇంకా విస్తృత చర్చల కోసం తెలంగాణ జిల్లాల్లో పర్యటన చేసింది కమిషన్. చాలామంది అభిప్రాయాలను సేకరించింది.
హైస్కూల్ విద్యార్థుల దగ్గర్నుంచి, అరువై ఏండ్లు పైబడిన వారి దాకా అందరూ ఆంధ్రతో కలవడాన్ని వ్యతిరేకించారు. శ్రీరామిని మృత్యుంజయ లింగం, దుగ్గిశెట్టి వెంకటయ్య గుప్తా కమిషన్‌ను కలిసి తమ అభిప్రాయాన్ని నివేదించారు. ‘తమిళుల నుంచి విడిపోవాలని మాత్రమే ఆంధ్రులు ఉద్యమం చేశారు. ఆర్థికంగా చితికిపోయినవారిని సంపన్న రాష్ట్రమైన తెలంగాణతో కలిపితే తెలంగాణకే తీవ్ర నష్టం. అప్పటిదాకా ఆంధ్రులతో ఉన్న పరిచయాన్ని బట్టి చూస్తే, వారు తెలంగాణను ఆక్రమించుకొని ఈ ప్రాంత ప్రజలను అణచేస్తారు’ అని వారు గట్టిగా చెప్పారు.
హైదరాబాద్‌లో అప్పుడే ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన ఆనందరావు తోట.. కమిషన్ అపాయింట్మెంట్ తీసుకొని ఫజల్ అలీని కలిశాడు. ఆ రోజు కేవలం 15 నిమిషాలు మటుకే సమయం ఇచ్చిన ఫజల్ అలీ.. 18 ఏండ్ల యువకుడు, తను కూర్చోమన్నా కూర్చోకుండా నిల్చుని స్వచ్ఛమైన ఉర్దూ భాషలో అనర్గళంగా తెలంగాణ రాష్ట్రం గురించి, వారి సంస్కృతి, చరిత్ర, తెలంగాణ ప్రజల హార్దిక ప్రకృతి గురించి
చెప్తుంటే చాలా ముచ్చటపడ్డాడు.
మర్నాడు మళ్లీ తనని కలవాలని రెండు గంటల సమయం కేటాయించాడు. ఆనందరావు తోట మళ్లీ మర్నాడు వెళ్లినప్పుడు ఆంధ్రులతో తెలంగాణ వారి అనుభవాలను కూడా వివరించి, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ వివరాలు, మూడేండ్లు ఆంధ్ర రాజకీయ నాయకులు తమ ప్రజల పట్ల చూపిన నిరాసక్తత, తదితర అన్ని విషయాలను వివరించారు. ఈ రెండు ప్రాంతాలు కలిస్తే ఇంక తెలంగాణ ప్రజలకు విముక్తి ఉండదని, రజాకార్ల సమయంలో కంటే, మిలటరీ చర్య కంటే ఎక్కువ దారుణాలు వారు చూస్తారని చాలా ఆవేదనగా చెప్పారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ స్థాయి నుంచీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యేదాకా అహర్నిశలు తెలంగాణ ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నారు వారు.
తెలంగాణ, మరాఠ్వాడా, కన్నడ జిల్లాల్లో పర్యటించి, అదే ఏడాది సెప్టెంబర్ 6 నుంచి కర్నూల్, ఇతర ఆంధ్ర ప్రాంతాల్లో పర్యటించారు కమిషన్ సభ్యులు. 1955 జూలై చివరి వరకు దాదాపు 104 ప్రాంతాలను సందర్శించి అక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. 38,000 మైళ్లు వివిధ రాష్ర్టాల్లో పర్యటించారు. 1955, సెప్టెంబర్ 30న ఫజల్ అలీ కమిషన్ రాష్ర్టాల పునర్విభజన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. నిజానికి ఈ కమిషన్ రాష్ర్టాలను నిర్ణయించడానికే కానీ, భాషాప్రయుక్త రాష్ర్టాలను నిర్ణయించడానికి ఉద్దేశించినది కాదు. ఎస్ఆర్సీ అంటే స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్!
తెలంగాణకు సంబంధించి ఇతర ప్రధాన సిఫారసులను కమిషన్ ఈ విధంగా చేసింది.
తెలంగాణ, ఆంధ్ర పరిస్థితులను చక్కగా పరిశీలించి నివేదికలోని 375 పేరా నుంచి 393 పేరా దాకా కమిషన్ ఈ వ్యాఖ్యలు చేసింది. నిజానికి వారు తెలంగాణకు నీళ్లు (నదీజలాలు), నిధులు (మిగులు నిధులు), నియామకాలు (ఉద్యోగాల పంపిణీ)లో నష్టం జరిగే అవకాశం ఉందని స్పష్టంగా గ్రహించారు. ఈ అసమానతలు ఇరు ప్రాంతాల మధ్య భావసమైక్యత కంటే.. వైరాన్ని, వ్యతిరేకతను, వైరుధ్యాన్ని ఇంకా పెంచే అవకాశం ఉంటుందని కూడా గ్రహించారు, నివేదికలో వివరించారు. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయాలు తెలంగాణ వారిని ఆనందంలో ముంచగా, ఆంధ్ర నాయకులను అశాంతికి, అసంతృప్తికి గురిచేశాయి. వారి ఏడుపులు, కుట్రలు వివరంగా వచ్చే వ్యాసంలో!
– దంటు కనకదుర్గ