పొద్దున లేస్తే నాటి నిజాం రాజులను విమర్శించడం ఇప్పుడొక ఆచారం. దాని సంగతి సరే, నేటి కాంగ్రెస్ పాలకులు సాగిస్తున్న అనాచారాల మాటేమిటనేది అసలు ప్రశ్న. వందేండ్ల క్రితం వరదలతో మూసీ ప్రళయ తాండవం చేస్తే ప్రజలు ఘోరకలి చూశారు. వడవడ వణికిపోయారు. అది చూసి అప్పటి రాజు గుండె కరిగి కన్నీరుమున్నీరయ్యారు. నదీమతల్లీ శాంతించు అంటూ హారతులిచ్చి జోతలు పట్టారు. బోనాలెత్తించి అమ్మలను వేడుకున్నారు.
ఇక వరదల సమస్య శాశ్వత పరిష్కారానికి తర్వాతి కాలంలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి విశ్వవిఖ్యాత ఇంజినీర్లను రప్పించారు. ఎగువన జలాశయాలు కట్టి అడ్డువేసి ప్రజలను ఆదుకున్నారు. గండిపేట చెరువును ఉస్మాన్సాగర్గా విస్తరించి, హిమాయత్ సాగర్ తవ్వి ప్రజల దాహార్తినీ తీర్చారు. మూసీని ఆసరాగా చేసుకుని నగరాన్ని విస్తరించి దాని తీరాన సుందర సౌధాలను గోపురాలతో సహా తీర్చిదిద్దారు. రాతి పందిళ్లు నిర్మించి నగర పౌరులకు ప్రశాంత నదీవీక్షణ సౌకర్యాన్ని కల్పించారు.
కాలక్రమంలో రాజులు పోయి కాంగ్రెస్ తరాజులు వచ్చారు. నాటి పాలకులు కట్టించిన అవే జలాశయాలను ఆసరాగా చేసుకొని ఇప్పుడు ప్రజలను నిలువునా ముంచి తమాషా చూస్తున్నారు. నాటి పాలకుల లక్ష్యం వరదలు నివారించి ప్రజలను కాపాడటమైతే నేటి పాలకులకు వరదలు సృష్టించి నగరాన్ని తరిమికొట్టడమే ఇష్టం. పొద్దున లేస్తే మూసీ అభివృద్ధి, సుందరీకరణ అంటూ వల్లించి చివరకు వరదల్ని ఆయుధంగా మలచుకుని ప్రజలను బలిపెడుతున్నారు. వారికి కావాల్సింది మూసీ అభివృద్ధి కానే కాదు. దాని వెనుకనున్న లక్ష్యం లక్షన్నర కోట్ల ప్రాజెక్టు, అందులో దొరికే కమీషన్ల కోసం కక్కుర్తి.
పేదోళ్లను తరిమికొట్టి పెద్దోళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టాలనే ఆత్రుత. నాటి పాలకులు మూసీలో పైసలు పోసి ప్రజలకు ప్రాణ రక్షణ కల్పిస్తే నేటి కాంగ్రెస్ పాలకులు ఆ మూసీలోనే కాసులవేట సాగిస్తున్నారు. పాత నగరాన్ని కాపాడలేనోళ్లు కొత్తగా ఫ్యూచర్ సిటీ కడతామని ఎగిరెగిరి పడుతున్నారు. ఇక్కడ ప్రజలు మూసీ నది మురికిలో సతమతమవుతుంటే అక్కడెక్కడో శిలాఫలకాలు వేయడానికి ఉరుకులాడుతున్నారు.
ఈ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచీ ప్రజలపై, ముఖ్యంగా పేదలపై పగబట్టింది, కక్షగట్టింది. హైడ్రా పేరిట మూసీ తీరవాసులకు నిత్యనరకం చూపిస్తున్నది. పండుగ లేదు, పబ్బం లేదు, పగలు లేదు, రాత్రి లేదు.. బుల్డోజర్లను తోలుతూ భయోత్పాతం సృష్టిస్తున్నది. పైసాపైసా కూడబెట్టి గూడుకట్టుకున్న బక్కపేదోళ్లకు నిద్రలేకుండా చేస్తున్నది. పిల్లాపాపలతో సంసారాలు వీధిపాలైతే, పిల్లల బడిపుస్తకాలు బురదపాలైతే వినోదం చూస్తున్నది, వికటాట్టహాసాలు చేస్తున్నది. కోర్టు సెలవునూ కోవర్టుగా వాడుకునే వికృతచేష్టలకు పాల్పడుతున్నది. కోర్టులు మొట్టికాయలు వేసినా, తలంటు పోసినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా బరితెగిస్తున్నది. ఇప్పుడు మూసీ నది ముంపు ఆ కంపు ధోరణికి కొనసాగింపు మాత్రమే!