హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన బాకీ కార్డు ఉద్యమం రేవంత్ సర్కారు భరతంపట్టే బ్రహ్మాస్త్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గల్లీ ఎన్నికలైనా ఢిల్లీ ఎన్నికలై నా గెలిచేది బీఆర్ఎస్సేనని, ఎగిరేది గులాబీ జెండాయేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పా రు. 15రోజుల కిందట గద్వాలకు వెళ్లినప్పుడు, మొన్న అచ్చంపేటకు వెళ్లినప్పుడు ఎక్కడా చూసినా ఇదే వాతావరణం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. రానున్న స్థానిక, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గులాబీ ప్రభంజనం ఖాయమని జోస్యం చెప్పారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన ప్రదీప్‌చౌదరి తన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సా దరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఓట్లకోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చిందని మండిపడ్డారు. వాటిని 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు నట్టేట ముంచుతున్నదని ధ్వజమెత్తారు. నాడు ఓట్ల కోసం విడుదల చేసిన అభయహస్తం మ్యానిఫెస్టో కాంగ్రెస్ పాలిట భస్మాసురహస్తంగా మారనున్నదని హెచ్చరించారు. బీఆర్ఎస్ విడుదల చేసిన బాకీ కార్డే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ పతనాన్ని శాసిస్తుందని స్పష్టం చేశారు.
వరదలు సహా అనేక సమస్యలతో హైదరాబాద్ నగర ప్రజలు ఆగమవుతుంటే ముఖ్యమంత్రి మాత్రం కొత్త నగరం కడతానంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఉన్న నగరంలో చెత్తతీయడం, వీధిదీపాలు వేయడం, దుర్గంధంతో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలను తీయడం చేతగాని సర్కారు ఫోర్త్‌సిటీ పేరిట ఫొజులు కొట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి చందంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నరు. నగర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే పట్టని ఆయన ఊహాజనిత నగరాన్ని ఉద్ధరిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నరు’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ హయాంలో 42 ఫ్లై ఓవర్లు, అనేక అండర్‌పాసులు నిర్మించి నగరవాసుల కష్టాలను గట్టెక్కించారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు 22నెలల్లో కనీసం ఒక్క ఇటుక పేర్చలేదు. చిన్న గుంత పూడ్చలేదు, ఉన్న రోడ్లను కూడా సక్కగా నిర్వహించడంలేదు. కానీ, అది కడతాం.. ఇది చేస్తాం’ అంటూ ఉద్దెర మాటలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నదని దుయ్యబట్టారు. తన కుటుంబ సభ్యుల భూముల రేట్లు పెంచుకొనేందుకు ఫ్యూచర్ సిటీ ముసుగులో రియల్ దందా సాగుతుందని అన్నారు.
కాంగ్రెస్ వస్తేనే కర్షకులకు కష్టాలు వస్తాయనే విషయం రేవంత్‌రెడ్డి 22 పాలనను చూస్తే ఇట్టే తెలిసిపోతుందని కేటీఆర్ దెప్పిపొడిచారు. తెలంగాణ రాకముందు ఎరువులు, యూరియా, విత్తనాల కోసం రైతులు చెప్పులను క్యూలైన్లు పెట్టే పరిస్థితి ఉండేదన్నారు. కానీ కేసీఆర్ ముందుచూపుతో పదేండ్ల పాలనలో ఏనాడు అలాంటి పరిస్థితులు రానీయలేదని స్పష్టం చేశారు. కానీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కగానే ఊరూరా ఎరువుల కోసం చెప్పుల జాతరలు కనిపిస్తున్నాయని, మహిళా రైతులు యూరియా బస్తా కోసం ముష్టియుద్ధా లు చేసే దారుణమైన పరిస్థితులు దాపురించాయని దుమ్మెత్తిపోశారు. రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు. ‘రుణమాఫీ చేయలేదని రైతులు, పింఛన్లు పెం చలేదని వృద్ధులు, దివ్యాంగులు, రూ. 2,500 ఇవ్వలేదని మహిళలు, స్కూటీలు ఇవ్వలేదని యువతులు, ఉద్యోగాలివ్వలేదని నిరుద్యోగులు’ ఇలా అందరూ ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. మోసపూరిత సర్కారుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
నాడు ఎన్టీరామారావు తెలుగువారి ఖ్యాతిని ఢిల్లీ వీధుల్లో ఇనుమడింపజేశారని కేటీఆర్ కొనియాడారు. ఇది ఎవరూ కాదన్నా, ఔనన్నా ఇది ముమ్మాటికీ వాస్తవమని కుండబద్దలు కొట్టారు. అదే తరహాలో 14 ఏండ్లు పోరాడి, ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ అస్తిత్వపతాకను, ఈ ప్రాంత సత్తాను హిమాలయ శిఖరాలకు తీసుకెళ్లారని స్పష్టం చేశారు. ఉద్యమస్ఫూర్తితో పాలన చేసి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత ఆయనకే దక్కిందని తేల్చిచెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సంసిద్ధంగా ఉన్నదని కేటీఆర్ ప్రకటించా రు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటుతారని స్పష్టం చేశారు. అభయహస్తం, ఆరు గ్యారెంటీల పేరిట మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీలు, పరిషత్తులపై గులాబీ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ఇక్కడ వచ్చిన ఫలితమే భవిష్యత్తులో తెలంగాణ దిశ, దశను నిర్దేశిస్తుందని పేర్కొన్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్‌లో మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఒక్కసీటు మినహా అన్నీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకున్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు నాడు దక్కింది శూన్య హస్తమేనని ఎద్దేవా చేశారు. కార్యకర్తల కృషితోనే బీఆర్ఎస్ అఖండ విజయం సాధించిందని చెప్పారు. ఇప్పుడు ఇదే పద్ధతిలో రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కష్టపడి పనిచేయాలని ఉద్బోధించారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ రూపొందించిన బాకీ కార్డులను పంచిపెట్టి రేవంత్ సర్కారును ఎండగట్టాలని సూచించారు. మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మ విజయానికి అలుపెరగకుండా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు.
ప్రజాబలం ఉన్న ప్రదీప్‌చౌదరి, ఆయన అనుచరుల చేరికతో పార్టీబలం రెట్టింపైందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేతలు అబిద్ రసూల్‌ఖాన్, మహేశ్‌యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంఎన్ శ్రీనివాస్‌రావు, దీపక్ యాదవ్, మహేంద్రచౌదరి, పొట్లూరి కిరణ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.