సిద్దిపేట, సెప్టెంబర్ 29: ప్రకృతిని ప్రేమించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతం అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో కుటుంబంతో కలిసి ఆయన పాల్గొన్నారు. మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం హరీశ్‌రావు కుటుంబ సమేతంగా వాటర్ బోటులో షికారు చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకుంటూ తెలంగాణ గొప్పతనాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెబుతున్నట్లు చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ పండుగలకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం కేసీఆర్ మన పండుగలను గుర్తించి అధికారికంగా నిర్వహించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందన్నారు. వర్షాకాలంలో చెరువుల్లో కొత్త నీరు వచ్చి చేరుతుందని, వివిధ రకాల పూలతో బతుకమ్మలను తయారుచేసి చెరువుల్లో వదలడంతో ఆ నీరంతా శుద్ధి అవుతుందని తెలిపారు.
ప్రకృతిని ప్రేమించి, ఇంత గొప్పగా పండుగలు జరుపుకొంటున్నందుకు ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు కోమటి చెరువు మినీ ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లలో హరీశ్‌రావు కలియ తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రజలు హరీశ్‌రావుతో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం చూపారు.