బతుకమ్మ పండుక్కి పూలన్నీ
అవ్వగారింటికచ్చినట్లుంటే..
ఇన్నొద్దులు సిన్నబోయిన ఇల్లు
ఆడిబిడ్డలు గల్మలకు రాంగనే
నాకేం తక్కువన్నట్లు ఎగురుతుంటే…
పైనున్న పెంకులన్ని పూలకు
కావలి కాస్తన్నయ్..
తెంపుకచ్చిన తంగేడు పువ్వు
తాంబాలం కోసం అట్క
మీదకి నిక్కి నిక్కి సుత్తాంటే…
గంపలున్న గునుగు పువ్వు నాకు
రంగులద్దమని తాతకు సైగ సేత్తంది
పట్టు సీతమ్మ గుత్తులు నేనే బతుకమ్మకు
పట్టు చీర కట్టినట్లుంటనని ముర్తాంటే
గుడిసె మీదున్న గుమ్మడి పూలు
నేను లేంది గల్మెట్ల
దాటుతరని గర్ర మీదున్నయ్
ఇక నన్నెట్ల మర్షిపోతరని కట్లపూలు
దడి పాంట నిలవడి జవుడానికి దిగితే..
ఆయింత మందచ్చి పూలన్నీ బర్కపోతరని
అమ్మమ్మ ఏగిరవడుకుంట
చిన్నంచందుకొని
పెరట్ల పువ్వులను కోస్కత్తే..
భవంతిల పూల జంబుఖాన
పర్శినట్లున్నది..
ఆకిట్లకు అచ్చిపోయేటోళ్లతో
ఊరంత గలగలలు…
బతుకమ్మలు పెద్దర్వాజ దాటితే
శెరువు కట్ట మీద ఉద్యమ
దెబ్బలన్నీ సప్పట్లయ్ ఇనవడుతాంటే..
రాగమందుకున్నది నడిపొల్ల బుచ్చక్క..
సత్తుపిండ్ల వాయనంతో..
వదిన మరదళ్ల ముచ్చట్లతో..
బతుకమ్మను మల్లేడాది దాకా
నిద్రపొమ్మని శెరువులంపితే…
తంగేడు పూలల్ల నా తెలంగాణ
బంగారమై మెరిసే….
-తుమ్మల కల్పన రెడ్డి
96404 62142