పుల్కల్, సెప్టెంబర్ 29: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గడం లేదు. సోమవారం మధ్యాహ్నం 1,08,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు డీఈ నాగరాజు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు 1,08,000 క్యూసెక్కులు రాగా, 1,06,137 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు తెలిపారు.
ఈ వానకాలం సీజన్లో సింగూరు ప్రాజెక్టులోకి 160 టీఎంసీల వరద వచ్చింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, 18.237 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి, ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నారు. దీంతో మంజీరా నది మహోగ్రరూపం దాల్చింది. గొర్రెల కాపరులు, మత్స్యకారులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు, పోలీసులు సూచించారు.