తెలంగాణ ఆత్మగౌరవ పతాక అయిన బతుకమ్మ పండుగ వస్తుందంటేనే ఊరూ వాడల్లో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. తెలంగాణ
జన జీవనంలో అంతర్భాగమై ఆనందాలను, ఆత్మీయతలను మూటగట్టుకొని వచ్చే ఈ పూల పండుగ ప్రపంచంలో మరెక్కడా లేదు. అయితే, ఈ పండుగను పోలిన పండుగలున్నాయి. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ వ్యవసాయానికి పర్యావరణానికి సంబంధించినది కూడా.
ఏటా మహాలయ అమావాస్య (పితృ అమావాస్య/ పెత్రమాస) నుంచి తొమ్మిది రోజుల ఆటపాటలు, చప్పట్ల ముచ్చట్ల కోలాహలంతో సాగే ఈ సామూహిక ఉత్సవం మహిళా సమైక్యతకు నిదర్శనం. మన సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు ముందు తొమ్మిది రోజులు బొడ్డెమ్మ పండుగను జరుపుకొంటారు. బతుకమ్మ పండుగకు సంబంధించి రకరకాల కథలున్నాయి. ఆడపిల్లను గౌరీదేవిగా భావించి గౌరవించి, పూజించడమే కుటుంబసభ్యులంతా బంధుమిత్రులతో కూడి ఉల్లాసంగా జరుపుకొనే పండుగ సంబురం ఇది.
ఇక ఆ తొమ్మిది రోజులు బాలికలు,మహిళలు ఉన్నంతలో తయారై సాయంత్రం పూట ముందుగా ఇంటిముందు (ఇంటిలో) శుభ్రం చేసి ముగ్గువేసిన ప్రదేశంలో బతుకమ్మను పెట్టి ఆటపాటలతో వాటిచుట్టూ మూడుసాైర్లెనా తిరిగి వాటిని పట్టుకొని (నెత్తిన పెట్టుకొని) చెరువు గట్టు, గుడి ఆవరణ లాంటి నిర్ణీత ప్రదేశానికి వెళ్లి ఎత్తిన బతుకమ్మలను అక్కడ దించుతారు. ఇక్కడ ఆటతో పాటు పాట కూడా ప్రధానం.
ఈ పాటల్లో బతుకమ్మకు సంబంధించి పౌరాణిక, చారిత్రక, జానపద, సామాజిక గాథలెన్నో చెప్పబడుతాయి. మౌఖిక సాహిత్యం నుంచి పుట్టిన ఈ పాటల్లో వావి వరుసలు, పుట్టింటి, అత్తింటి సంబంధాలు, జీవన విధానాలు, భక్తి భావనలు, స్త్రీల కష్టాలు, కన్నీళ్లు, కుటంబ బంధాలు, అప్పగింతలు, సంవాదాలు, కర్తవ్యాలు మొదలైన అంశాలెన్నింటితోనో అల్లబడిన విషయాలు అర్థమవుతాయి, ఆలోచింపజేస్తాయి. గొంతులు కలిపి ఆయా పాటలను పాడుకోవడం సంతోషానికే కాదు, జ్ఞాపకశక్తికి కూడా నిదర్శనం. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడుకుంటే ఆ ఆనందమే వేరు. ఆ పాటలన్నింటినీ సేకరించి నిక్షిప్తం చేసుకోవలసిన బాధ్యత మనపై ఉన్నది. అట్లాంటి పాటల్లో కొన్ని… ‘శ్రీలక్ష్మీదేవి ఉయ్యాలో/ సృష్టి బతుకమ్మయ్యె ఉయ్యాలో/ ధర చోళ దేశమున ఉయ్యాలో/ ధర్మాంగుడను రాజు ఉయ్యాలో’ అని చెప్తూ చివరలో ‘జగతిపై బతుకమ్మ ఉయ్యాలో/ శాశ్వతంబుగ నిలిచె ఉయ్యాలో’ అంటూ ఆ కథను చెప్తారు.
‘రామ రామ రామ ఉయ్యాలో/ రామనే శ్రీరామ ఉయ్యాలో/ రామ రామనంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో’ అంటూ కుటుంబ బంధాలను తెలుపుతూ అన్ని పూలను తేవడంతో పాటు ‘పోయిరా బతుకమ్మ ఉయ్యాలో/ మళ్లొచ్చే ఏడాదికి ఉయ్యాలో’ అని పూర్తవుతుంది. ‘కలవారి కోడలు ఉయ్యాలో/ కనకమహాలక్ష్మి ఉయ్యాలో’ అని మొదలై అత్తింట సమిష్టి కుటుంబంలో ఉన్న అమ్మాయి తనను తీసుకెళ్లడానికి వచ్చిన అన్నతో పుట్టింటికి వెళ్లడానికి కుటుంబంలో అందరి అనుమతి తీసుకోవడం, చివరగా భర్త అనుమతించి ‘కట్టుకో చీరెలూ ఉయ్యాలో/ పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో’ అని చెప్పడం తో పూర్తవుతుంది. అయితే బతుకమ్మ ఆటను ముందుగా పూల పాట ఆడే ‘ఒక్కేసి పువ్వేసి చందమామ/ ఒక్క జామాయె చందమామ’ అని, ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ/ ఏమేమి కాయొప్పునే’ అని తర్వాత ‘ఒక్కేసి వెలగపండే గౌరమ్మ/ దూరాన దోరపండే’ అంటూ పండ్లకు సంబంధించి, ‘ఒక్కొక్క అక్షింతలూ గౌరమ్మ/ ఒక్క మల్లెసాలలూ గౌరమ్మ’ అంటూ అక్షింతలకు సంబంధించిన పాటలతో ప్రారంభిస్తారని మా పెద్దలు చెప్పేవాళ్లు.
తొమ్మిది రోజుల పాటు భక్తీశ్రద్ధలతో, సరదా సందడితో సాగే సందర్భంలో 6వ రోజు ‘అర్రెం’ అని (బహు శా విశ్రాంతి కోసం అయ్యుంటుంది) ఆడరు. 9వ రోజు తీరొక్క పూలతో, చీరెసారెలతో తీర్చిదిద్దిన సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకొంటారు. ఈ తొమ్మిది రోజులూ పండ్లతో పాటు రకరకాల పదార్థాలతో చేసిన వంటకాలను, పల్లీలు నువ్వులు, పెసలు మొదలైన కొత్త పంటల ధాన్యాలను పొడులుగా కొట్టి బెల్లంతో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. వీటినే సత్తుపిండి అని కూడా అంటారు. ఇక చివరి ఘట్టంగా బతుకమ్మపై భాగాన ఉన్న గౌరమ్మను తీసి బతుకమ్మ కుదురును జాగ్రత్తగా నీటిలో జార విడుస్తారు.
అక్కడ పళ్లెంలో తెచ్చిన కొన్ని నీళ్లలో గౌరమ్మ నుంచి మరొక పళ్ళెంతో దానిని మూసి ‘హిమవంతునింట్లో పుట్టి / హిమవంతునింట్లో పెరిగి’ అంటూ ఊయలలూపుతూ చివరలో ‘మాయమ్మ గౌరీదేవి పోయిరావమ్మా/ మాయమ్మా లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా’ అని, ‘ఉసికలో పుట్టిన గౌరమ్మ/ ఉసికల పెరిగిన గౌరమ్మ/ ఉసికిల వసంతమాడంగ’ అంటూ పసుపు, కుంకుమ, అక్షింతలను కూడా ఆ పాటలో పదాలుగా చేర్చి చివరలో ‘పోయిరా గౌరమ్మా పోయిరావమ్మా’ అంటూ ఓలలాడిస్తారు. తర్వాత ఆ పసుపును, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. నైవేద్యాలను అందరికీ పంచుతారు. అయితే, ఈ బతుకమ్మ సంబురాల్లో పూల సేకరణ, బతుకమ్మ అమరిక, ప్రసాదాల తయారీ, బతుకమ్మలను నిర్ణీత ప్రదేశాలకు చేర్చడం, ఆటపాటలప్పుడు పిల్లలను చూసుకోవడం, నిమజ్జనం లాంటి విషయాల్లో మగవాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంటుంది. అందుకే, ఇది కుటుంబ బంధాలను పెనవేసే పండుగ.
మన తాత్విక ఆచరణలను గుర్తుచేసే ఈ సామాజిక సందర్భంలో పళ్ళు అత్తగారింటికి పోయిన బిడ్డలను పుట్టింటికి పిలిచి వాళ్ళను చీరెలు సారెలతో సత్కరించి పంపించడం ఒక సంప్రదాయం. ఇట్లా తెలంగాణకు శిఖరాయమైన మట్టి పండుగ, చెట్టు పండుగ, నీటి పండుగ, రుచుల పండుగ, ఎన్నింటినో తెలుసుకొని, తలచుకొని మురిసిపోయే పండుగ అయిన ఈ బతుకమ్మ పండుగలో ఔషధ గుణాలు, చికిత్స లక్షణాలు ఇమిడి ఉన్నాయి. అందుకే ఈ పండుగ పూల జాతరై సాంస్కృతిక వారసత్వంగా కొనసాగుతున్నది.
నాడు పల్లెలకు మాత్రమే పరిమితమైన బతుకమ్మ పండుగ తర్వాతి కాలంలో పట్టణాలకు, నగరాలకు, విదేశాలకు కూడా విస్తరించింది. భిన్న, ఆచార సంప్రదాయాలన్నీ గేటెడ్ కమ్యూనిటీల్లోనూ తెలంగాణ అస్తిత్వ గుర్తింపులో బతుకమ్మ భాగమవుతున్నది. ఎక్కడున్నా ఆధునిక పోకడలతో కృత్రిమత్వానికి తావివ్వకుండా సహజసిద్ధమైన వాతావరణంలో అర్థవంతంగా, ఆత్మీయబంధాలు పెనవేసుకునే విధంగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం మనందరి బాధ్యతగా భావించాలి. అప్పుడే బతుకమ్మ ఒక వేడుకనే కాదు, మట్టి పరిమళం, జాతి జీవనం అనే సందేశం భావితరాలకు అందుతుంది. ఈ సంస్కృతీ సంప్రదాయం కొనసాగుతుంది.
‘గుమ్మడి పూలు పూయగ బ్రతుకు
తంగెడు పసిడి చిందగ బ్రతుకు
గునుగు తురాయి కులుకగ బ్రతుకు
బతికి బ్రతికి బతుకుల బతికిస్తూ
బతుకమ్మా! బ్రతుకు’
-ప్రజాకవి కాళోజీ
-డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి
98492 34725