నార్కట్పల్లి మే 13 : కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నార్కట్పల్లి మం డలం షాపల్లి, నెమ్మాని గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ సర్కారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని పండగలా మారిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దండగలా మార్చిందన్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.లారీలు సరైన సమయానికి రాక రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు.
లారీలు ఉన్నచోట సంచులు ఉండవని, సంచులు ఉన్నచోట లారీలు ఉండవని మండిపడ్డారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి సకాలంలో కాంటాలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, మేకల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు.