వికారాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో తీవ్ర ఎండల ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గుతుతున్నాయి. నెర్రెలు వాచిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమంతో పూడికతీత పనులు చేపట్టి చెరువులకు పూర్వ వైభవం తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చెరువుల్లో నీరు లేక కళ తప్పాయి. కేసీఆర్ సర్కారు హయాంలో చెరువులు, ప్రాజెక్టుల్లో పూడికతీత పనులతో మండు వేసవిలోనూ 90 శాతం మేర నీటినిల్వలు ఉండి భూగర్భజలాలకు ఎలాంటి ఢోకా లేని పరిస్థితులు ఉండేవి కానీ ప్రస్తుత ప్రభుత్వం చెరువులు, ప్రాజెక్టుల్లో పూడికతీత పనులతోపాటు తూములు, కాలువలు పాడైపోయిన మరమ్మతులకు సంబంధించి పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వలు లేక అడుగంటిపోతున్నాయి.
రెండున్నరేండ్లు దాటినా ఇప్పటివరకు చెరువులు, ప్రాజెక్టుల్లో పూడికతీత పనులకు సంబంధించి గంపెడు మట్టి కూడా తీయకపోవడం గమనార్హం. ప్రధాన ప్రాజెక్టులైన కోట్‌పల్లి, లక్నాపూర్, సర్పన్‌పల్లి, కాకరవేణి, జుంటుపల్లి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 60 శాతం కంటే తక్కువ నీటి నిల్వలున్నాయి. మెజార్టీ చెరువుల్లో నీటి నిల్వలు 80 శాతానికి చేరుకున్నాయి. దీంతో బోర్లు, బావుల్లోనూ నీటి నిల్వలు తగ్గిపోయాయి. జిల్లావ్యాప్తంగా 1179 చెరువులుండగా.. 85 వేల ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉన్నది. తాండూర్ డివిజన్లో 262 చెరువులు, కొడంగల్ డివిజన్లో 202, పరిగి డివిజన్లో 398, వికారాబాద్ డివిజన్లో 317 చెరువులున్నాయి. మెజార్టీ చెరువుల్లో 30-50 శాతం మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి.
గత బీఆర్ఎస్ సర్కారు చేసిన మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చారు. పూడికతీత పనులతో కనీసం 5 టీఎంసీలకు పైగా వృథాగా పారే జలాలను ఒడిసిపట్టేలా చెరువులను అభివృద్ధి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కట్టలకు పలు చోట్ల గండ్లు, తూములకు లీకేజీలతోపాటు అలుగులు పాడవడంతో కురిసిన వర్షం నీరు ఎక్కువగా వృథాగా పోయేది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పూడికతీత పనులతో అన్ని చెరువులకు మరమ్మతులు చేయడంతో చెరువులు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయి. సగటున 20-30 ఎకరాలకు నీరందించే చెరువు మిషన్ కాకతీయ పనులతో 120 -130 ఎకరాలకు నీరందించే స్థాయికి చేరుకున్నాయి.
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి చెరువుల్లో పూడికతీత పనుల వల్ల కనీసం 500 మిలియన్ క్యూబిక్ ఫీట్ల (5 టీఎంసీల) వృథాగా పారే జలాలను చెరువుల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు చెరువులకు తీసుకువచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఆయా పంటల సాగు విస్తీర్ణం కూడా గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది. జిల్లాలో 2014 అక్టోబర్‌లో 2.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా.. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులతో 5,88,977 ఎకరాలకు జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా నాలుగు విడతల్లో 790 చెరువులకు దాదాపు రూ.246 కోట్ల 95 లక్షల నిధులతో చెరువుల పునరుద్ధరణ పనులు చేసి, నాలుగు విడతల్లో కలిపి దాదాపు 70 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరందించేలా చెరువుల్లో పూడికతీత పనులు చేశారు.
జిల్లాలో మార్చి చివరి నాటికి 13.72 మీటర్ల లోతుకు అడుగంటిపోగా, ఏప్రిల్ చివరి నాటికి రెండు మీటర్ల మేర నీటి నిల్వలు తగ్గి 15.09 మీటర్లకు నీటి నిల్వలు తగ్గాయి. ఎండల తీవ్రత పెరగడంతో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి కూడా నీటి నిల్వలు కొంతమేర పర్వాలేదనిపించినా, నీటి నిల్వలు క్రమంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.