చెన్నై: తమిళనాడు కొత్త సీఎం విజయ్ రూ.648 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. రూ. 426.20 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 222.65 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. (Vijay Second Richest MLA) ఆ రాష్ట్ర అసెంబ్లీలో రెండో సంపన్న ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 184 కోట్ల ఆదాయాన్ని విజయ్ ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన వారిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమారోజ్ మార్టిన్ అత్యంత సంపన్నురాలు. లాల్గుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమె రూ.5,863 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు.
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 233 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), ఎన్నికల పర్యవేక్షక సంస్థ అయిన ‘తమిళనాడు ఎలక్షన్ వాచ్’ విశ్లేషించాయి. దీని ప్రకారం, విజయం సాధించిన 233 మంది అభ్యర్థుల మొత్తం సంపద రూ.11,265 కోట్లు. అంటే ఒక్కో ఎమ్మెల్యే సగటు సంపద సుమారు రూ.48.35 కోట్లు. 2021లో ఒక్కో ఎమ్మెల్యే సగటు సంపద కేవలం రూ. 12.27 కోట్లు మాత్రమే. ఈ లెక్కన గత ఐదేళ్లలో తమిళనాడు ఎమ్మెల్యేల సగటు సంపద దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
మరోవైపు పార్టీల పరంగా పరిశీలిస్తే, ఎన్నికల్లో భారీ విజయం సాధించిన అధికార టీవీకేకు చెందిన 107 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 27.09 కోట్లు. డీఎంకే తరపున గెలిచిన 59 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 14.34 కోట్లు. అన్నాడీఎంకే తరపున విజయం సాధించిన 47 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 152.89 కోట్లు. కాంగ్రెస్ తరపున గెలిచిన ఐదుగురు అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 17.81 కోట్లు.