న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పేపర్ లీక్, రద్దుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జెన్ జెడ్ మేల్కోవాలని, అన్యాయం, కేంద్ర దుష్పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బుధవారం ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
2014లో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 93 పేపర్ లీక్‌లు జరిగినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. ఎగ్జామ్ లీక్‌లలో చాలా వరకు రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ వంటి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలున్న బీజేపీ రాష్ట్రాలలోనే జరిగాయని విమర్శించారు.
కాగా, ప్రస్తుత నీట్ పేపర్ లీక్ వల్ల సుమారు ఆరు కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైదని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ‘కాబట్టి, నేను జెన్ జెడ్ ను అడుగుతున్నా. ఇది ఇలాగే కొనసాగుతుందా, లేక మీరు ఏదైనా చేస్తారా?’ అని ప్రశ్నించారు. ‘బంగ్లాదేశ్, నేపాల్‌లో ప్రభుత్వాలను జనరేషన్ జెడ్ గద్దె దింపగలిగినప్పుడు, మన అవినీతిపరులైన (బీజేపీ) నాయకులను జైలుకు పంపలేరా?’ అని నిలదీశారు.
మరోవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులపై జరుగుతున్న దర్యాప్తు కేవలం కంటితుడుపు చర్యేనని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రతి ఏటా సీబీఐ కొంతమందిని అరెస్టు చేస్తుందని, అయితే వారు ఆ తర్వాత విడుదలయ్యి మళ్లీ పేపర్ లీకేజీ కుట్రకు పథకం రచిస్తున్నారని విమర్శించారు. సీబీఐ దర్యాప్తు జరిపితే తమకే చిక్కులు తప్పవన్న ఉద్దేశంతో ఎన్డీయే ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
जागो Gen-Z जागो। उठो और लड़ो।
इस वीडियो को ज़्यादा से ज़्यादा लोगों से शेयर करें और इस पर चर्चा करें। pic.twitter.com/7aHVCJWpHX
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 13, 2026