హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో హైడ్రా పేరుతో బ్లాక్మెయిల్, బెదిరింపులు, అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రాను రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే సాధనంగా మార్చుకున్నారని విమర్శించారు. హైడ్రా వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదని మండిపడ్డారు. హైడ్రా పేరుతో బెదిరింపు రాజకీయాలు సాగుతున్నాయని, దీని వెనుక భారీ అవినీతి ఉన్నదని విమర్శించారు.
చట్టం అందరికీ సమానమైతే అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవాలని, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్, ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, అనుముల తిరుపతిరెడ్డికి సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సవివరంగా సమాధానాలిచ్చారు. ఢిల్లీలో యువత ఆందోళనలు, పరీక్షల సంసరణలు, డీలిమిటేషన్, తెలంగాణ అభివృద్ధి వంటి పలు అంశాలపై కూడా తన అభిప్రాయాలను ఖుల్లంఖుల్లా వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు, మంత్రులకు చెందిన విల్లాలు, నివాసాలు, ఫామ్‌హౌస్‌లు చెరువులు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా ఎందుకు హైడ్రా అక్కడికి వెళ్లడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ నిర్మాణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఎంపిక చేసిన వారిపైనే చర్యలు తీసుకోవడం న్యాయం కాదని చెప్పారు. అన్ని అక్రమ నిర్మాణాలపైనా హైడ్రా చర్యలు తీసుకుంటేనే చట్టంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం పేదల ఇండ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటూ అధికార పార్టీ నేతల అక్రమ నిర్మాణాలను వదిలేస్తున్నారని విమర్శించారు.
హైడ్రా చర్యల్లో పారదర్శకత, సమానత్వం ఉండాలని, అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయం ఉండకూడదని సూచించారు. హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ సామాన్యులపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, అదే చట్టాన్ని అధికార పార్టీ నేతల విషయంలో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. పారదర్శకత, సమానత్వంతో చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ అధికారం నుంచి దిగే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా, కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరిందని చెప్పారు. భూ వ్యవహారాల్లో అవినీతి, కమీషన్ల కోసమే నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో వేలాది ఇండ్లను కూల్చివేసి ఒక కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని, దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చేతిలో హైడ్రా బ్లాక్ మెయిలింగ్, ఎక్స్టార్షన్ సాధనంగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే హైకోర్టు సూచనలకు అనుగుణంగా హైడ్రాను రద్దు చేస్తామని ప్రకటించారు.
దేశంలో యువత ఏ రాజకీయ పార్టీ అండ లేకుండానే తిరుగుబాటు జెండా ఎగురవేసింది. నీట్ పేపర్ లీక్ కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమే.. విద్య, ఉపాధి వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల యువతలో అసంతృప్తి పేరుకుపోయింది. యువతకు ఇచ్చిన హామీల్లో అనేకం అమలుచేయకపోవడంతో కేంద్రంపై తీవ్ర కోపంతో ఉన్నరు. వారిలో నిరాశా నిసృ్పహలు పెరుగుతున్నయ్. ఈ పరిణామాలను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
– కేటీఆర్
దేశంలో యువత ఏ రాజకీయ పార్టీ అండ లేకుండానే తిరుగుబాటు జెండా ఎగురవేసిందని కేటీఆర్ చెప్పారు. నీట్ పేపర్ లీక్ కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమేనని, విద్య, ఉపాధి వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల యువతలో అసంతృప్తి పేరుకుపోయిందని చెప్పారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ ప్రకటించారని, కానీ, ఇవ్వడం లేదని, యువతకు ఇచ్చిన హామీల్లో అనేకం అమలు చేయకపోవడంతో కేంద్రంపై తీవ్ర కోపంతో ఉన్నారని చెప్పారు.
దేశ యువతలో నిరాశా నిసృ్పహలు పెరుగుతున్నాయని, ప్రస్తుత పరిస్థితులపై వారికి స్పష్టమైన అవగాహన ఉన్నదని పేరొన్నారు. ఈ పరిణామాలను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. గతంలోనే కేసీఆర్ దేశ యువత స్పందిస్తుందని చెప్పారని గుర్తుచేశారు. నేపాల్ తరహా జనరేషన్-జెడ్ ఉద్యమాలు భారత్‌లో కూడా వచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తూ, యువత ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తే రాజకీయ వ్యవస్థకే సవాల్‌గా మారుతుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ అధికారం నుంచి దిగే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా, కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరింది. భూ వ్యవహారాల్లో అవినీతి, కమీషన్ల కోసమే నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నరు. హైదరాబాద్‌లో వేలాది ఇండ్లు కూల్చివేసి ఒక కొత్త ఇల్లు కూడా కట్టలే. ముఖ్యమంత్రి చేతిలో హైడ్రా బ్లాక్ మెయిలింగ్ , ఎక్స్టార్షన్ సాధనంగా మారింది.
– కేటీఆర్
పరీక్షల సంసరణల పేరిట కొత్త చట్టాలు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ప్రభుత్వం ఏమి నేర్చుకున్నదో ప్రజలకు వివరించాలని కేటీఆర్ చెప్పారు. ఎన్డీయే హయాంలో ఐదుసార్లు పేపర్ లీక్‌లు జరిగాయని, అందులో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో మూడుసార్లు జరిగాయని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పలుమార్లు పేపర్ లీకులు జరిగాయని విమర్శించారు.
దేశానికి ఇప్పుడు జవాబుదారీతనం, పారదర్శకత, దీర్ఘకాలిక సంసరణలు అవసరమని పేరొంటూ, మంచి ఉద్దేశంతో పరీక్షల సంసరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. డాక్టర్ కే రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల అమలు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నందన్ నీలేకని కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే గత ప్రభుత్వ బకాయిలను సాకుగా చూపడం సరికాదని కేటీఆర్ హితవుపలికారు. గత ప్రభుత్వ బకాయిలు కొత్త ప్రభుత్వానికి రావడం సహజమేనని, ఆస్తులతోపాటు అప్పులు కూడా సంక్రమిస్తాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో చెల్లించాల్సిన సుమారు రూ.4,000 కోట్ల బకాయిలను కూడా చెల్లించిందని తెలిపారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర నెలవారీ ఆదాయం సుమారు రూ.4,000 కోట్లు ఉండగా, తమ పాలన ముగిసే నాటికి అది రూ.18,500 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఆస్తులను గణనీయంగా పెంచడంతోపాటు అభివృద్ధి కోసం కొన్ని అప్పులు కూడా తీసుకున్నామని వివరించారు. ఆస్తులు తీసుకున్నప్పుడు అప్పులు కూడా వచ్చే ప్రభుత్వాలు చెల్లించాల్సిందేనని, వాటిని సాకుగా చూపి ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు, మంత్రుల విల్లాలు, నివాసాలు, ఫామ్‌హౌస్‌లు చెరువులు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా ఎందుకు హైడ్రా అక్కడికి వెళ్లడం లేదు? ఈ నిర్మాణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎంపిక చేసిన వారిపైనే చర్యలు తీసుకోవడం న్యాయం కాదు. అన్ని అక్రమ నిర్మాణాలపైనా హైడ్రా చర్యలు తీసుకుంటేనే చట్టంపై ప్రజలకు నమ్మకం కలుగుతది. హైడ్రా చర్యల్లో పారదర్శకత, సమానత్వం ఉండాలె.
– కేటీఆర్
జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలను శిక్షిస్తూ, జనాభా పెరిగిన రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా డీలిమిటేషన్ ఉండకూడదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ ఉద్దేశం వికేంద్రీకరణ, ప్రజలకు మరింత చేరువలో ప్రజాప్రతినిధులను అందుబాటులో ఉంచడమేనని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టి రాజకీయ గందరగోళం సృష్టించారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు పెంచాల్సి ఉన్నా 12 ఏండ్లుగా అమలు చేయలేదని గుర్తుచేశారు. అసెంబ్లీ స్థానాలను ఎందుకు పెంచడం లేదని నిలదీశారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిన చట్టాలనే అమలుచేయని ప్రభుత్వం కొత్త హామీలను ప్రజలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
1971 జనాభా లెకల తర్వాత డీలిమిటేషన్‌ను నిలిపివేయడంతో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశాయని, ఉత్తర భారత రాష్ట్రాల్లో జనాభా పెరిగిందని పేరొన్నారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులతో తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలను చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
మాకు చెప్పకుండానే హైడ్రా అధికారులు మా ఇండ్లను కూల్చేసిండ్రు. ఏండ్ల నుంచి ఉంటున్న నా ఇంటినీ కూలగొట్టిన్రు. వద్దని ఎంత మొత్తుకున్నా విన్పించుకోలె! మా గోస ఊరికనే పోలేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కోర్టు తప్పించింది. మా ఇంటిని కూల్చిన విషయం మీద మేము కూడా కోర్టుకెళ్తం. కాంగ్రెస్ అధికారంలోకి రాంగనే హైడ్రా పెట్టి.. నిరుపేదలను రోడ్డున పడేసింది. మా ఉసురు ముట్టి.. రంగనాథ్‌కు కోర్టు తగిన బుద్ధిచెప్పింది.
– పద్మ, బాధితురాలు, ఐలాపూర్ (సంగారెడ్డి జిల్లా)