children stories | ఒక అడివి మొదట్ల ఒక మ్యాక, దాని పిల్లలు ఉండేటివి. అప్పుడే వుట్టిన పిల్ల మ్యాకలకు ఏం దెల్వది గదా, అటీటు ఉరుక్కుంట ఆగమాగం జేత్తుండేయి. తల్లి మ్యాక మస్తు కట్టంగ సారిచ్చుకుంట పులులు, తోడేళ్ల పాలి వడకుంట కాపాడుకుంట వచ్చేది. దినాం పిల్ల మ్యాకల్ని సవరిచ్చుడుతోనే అయ్యేది. పొద్దుమాపుల ఎట్లుండాలె… ఏం జెయ్యాలె.. పులి అంటే ఏంటిది.. తోడేలు ఎట్లుంటది… ఏంజేత్తది అనుకుంట పిల్ల మ్యాకలకు మస్తుగ యిగురం జెప్పేది. అయినా భయం లేక తల్లి అటీటు సూడంగనే శనంల మాయమై పోతుండె. లెంకులాడుకచ్చేవారకు తల్కాయ పాణం తోకల కచ్చేది.
ఒక పారి పిల్ల మ్యాకలకు పాలిచ్చి పండవెట్టి ఆకు దేనీకె జరంత దూరం పొయ్యచ్చింది తల్లి మ్యాక. అంతట్లకె ఒక మ్యాకపిల్ల శెంగుశెంగున దుంకుకుంట అడివి లోపల్కి వోయింది. కొంచెం దూరం వోంగనే అవ్వ జెప్పినమాటలు యాదికచ్చినయి… అటీటు జూసుకుంట ఎన్కకు మర్రుదమంట సూశింది గని, అచ్చిన తొవ్వ మర్శిపేయింది. ఏం జెయ్యాల్నో అర్తంగాలె. అట్టనే నడుసుకుంట ముందటికి పోవట్టింది. అట్ట పోంగవోంగ రాత్రైంది. శీకటి వడంగనే అవ్వ పక్కన ఎచ్చగ పండుకునేదాయె. శిమ్మని శీకటి అయ్యేవారకు మస్తు బుగులు గావట్టింది. భయంభయంగ జరంత దూరం వోంగనే గమ్మతుగ నాల బొయ్యారమసోంటి గుహ గనిపిచ్చింది. ఆల్లిల్లు గూడ గట్లనే శిన్న గుట్ట మీద ఉంటది గదా! ఆల్లసోంటోల్లుంటరని ఎన్కముందు సూడకుంట లోపలికి ఉరికింది.
పాపం, అది దాని మ్యానమామ నక్క ఇల్లు. అండ్ల ఆడీడ వడున్న మేక.. గొర్రెల బొచ్చుజూసి ఆల్లసోంటి ఇల్లనుకున్నది. తిర్గితిర్గి యాష్టకచ్చింది గదా… మస్తుగ వన్నది. పులిరాజు ఇంటికి దావత్కు వేయిన నక్క పండ్లపుల్ల వెట్టుకుని తిన్న కూరను యాజ్జేసుకుంట ఇంటికాడికి అచ్చింది. అది నాలబొయ్యాలరపు గుహనాయె. పిల్ల మ్యాక గుర్కకు బొయ్యి.. బొయ్యి మంట గుహ మార్మోగవట్టె. ఆ అరుపులు ఇనంగనె నక్క తిన్నదంత అర్గిపేంది. దానికంటె పెద్దదేదో ఇంట్ల సొచ్చిందని బుగులైంది. బుగులుతోనే, “నా ఇంట్ల ఉన్నోల్లెవలుల్లా?” అంట అడిగింది. మ్యాకపిల్లకు అవ్వ జెప్పిన మాటలు యాదికి అచ్చినయి. “నేను యాభై పులుల్ని దినే సింహం మ్యానత్తను” అంట గట్టిగ అరిశింది. అసలే.. గుహ.. గట్టిగ అరువంగనే నక్క శెవులకు శంకమోలె ఇనచ్చింది. “అయ్యో… దేవుడా!” అంట అడివిరాజు తానికి ఒక్కలెంకల ఉరికింది. అడివిరాజు, ఇంక పులులన్ని అచ్చి గుహ ముంగట నిల్సోని “ఎవలుల్ల లోపట” అనంగనే… “నేను పులుల్ని దినే గిలిని” అంట అరిశింది. దాని మాటినంగనే ఎక్కడియక్కడ గప్చుప్. అడివిలకు గిలి అచ్చిందని, నక్క గుహకాడికి ఎవలు వోతలేరని జీవాలన్ని మాట్లాడుకోంగ తల్లి మ్యాక ఇన్నది. ఎందుకైన మంచిదని గుహకాడికి వోయి పిలిశి సూశింది. మ్యా మ్యా అనుకుంట పిల్ల మ్యాక అరువంగనే తల్లి మ్యాక లోపలికి ఉరికింది. మాపటీలి గాంగనే దొంగదొంగోలె మెల్లగ అడివి దాటి బతుకు దేవుడా అనుకుంట ఇంటికి జేరినయి.
– పత్తిపాకమోహన్
children stories | రాజు కొబ్బరి చెట్లు పెంచుమని హుకూం చేస్తే ఇకమతులోడు ఎట్ల ఎగ్గొట్టిండంటే
Children Stories | తమ్మున్ని చూసి ఓర్వలేక చేసిన పనికి ఇజ్జత్ పోగొట్టుకున్న అన్న..
చంపి తిందామని వచ్చిన తోడేలును భలే బురిడీ కుట్టించిన కుందేలు
Children Stories | రంభనే నా పెండ్లాం