KTR | రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ వల్ల నష్టపోయిన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన రైతన్నలకు పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు రీజినల్ రింగ్ రోడ్డుతో ఎవరికీ ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీల మీదుగానే రైతులు కాంగ్రెస్‌కు ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చారని, అయితే అధికారంలోకి వచ్చాక అలైన్మెంట్ మార్చి రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక కాంగ్రెస్ నేతలు గెలిచిన తర్వాత రైతులను పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం, ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని సుభిక్షం చేశామని కేటీఆర్ తెలిపారు. గతంలో భూసేకరణ సమస్యలు ఎదురైనప్పుడు తమ ప్రభుత్వం నేరుగా రైతులతో చర్చలు జరిపి, వారికి పునరావాసం కల్పించి, శాశ్వత పరిష్కారాలు చూపించిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు విషయంలోనూ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అలైన్మెంట్లు మార్చి పేదల, రైతుల జీవితాలను ఆగం చేస్తోందని ఆరోపించారు.
ఆర్ఆర్ఆర్ బాధితుల అంశాన్ని పార్లమెంట్, రాజ్యసభలలో బీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తుతారని కేటీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని తీవ్రంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. రైతన్నలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. శాస్త్రీయబద్ధమైన అలైన్మెంట్ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఐకమత్యం ప్రదర్శించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని సూచించారు. ఇలా చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక దిగివస్తాయని, సమస్య వారి దృష్టికి వెళ్తుందని అన్నారు. “తెలంగాణ భవన్ అనేది జనతా గ్యారేజ్. రైతులు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి న్యాయ నిపుణులను సంప్రదించవచ్చు, సహకారం తీసుకోవచ్చు, సలహాలు పొందవచ్చు” అని కేటీఆర్ తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లాకు అద్భుతమైన అభివృద్ధి కల్పించామని, మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా తరిమివేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అబద్ధాలను నమ్మి ఓటేసిన ప్రజలకు ఇప్పుడు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. “రైతుల పోరాటానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరిత నిర్ణయాలు రైతుల జీవితాలను నాశనం చేయకుండా చివరి వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు.