KTR | కాంగ్రెస్‌కు ఓటేస్తే మన ఇండ్లను కూల్చేందుకు లైసెన్స్ ఇచ్చినట్లే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ బోరబండ డివిజన్ బూత్‌స్థాయి సమావేశం సోమవారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై.. మాట్లాడుతూ పేద ఇండ్లను రేవంత్‌రెడ్డి ఆదివారమే ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు వద్దని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. గాజులరామారంలో కోర్టు సెలవు రోజులు చూసుకొని మరీ పేదల ఇండ్లను కూల్చేశారని ఆరోపించారు. ఇవాళ గాజులరామారం.. రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి సైతం హైడ్రా పేరుతో వస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఇళ్లు కూల్చేందుకు లైసెన్స్ ఇచ్చినట్లేనన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారని.. కాంగ్రెస్ కూల్చిన ఇళ్లను మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత నాదేనన్నారు. హైడ్రా బుల్డోజర్ పేదల ఇండ్లపైకే వెళ్తుందని.. పెద్దల ఇండ్లకు వెళ్లదని విమర్శించారు. సీఎం సోదరుడు, మంత్రులు పొంగులేటి, వివేక్ వంటి వారు.. ప్రభుత్వ స్థలాల్లో, చెరువులపైన ఇండ్లు కట్టుకున్నా హైడ్రా కూల్చివేయలేదన్నారు.
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులోనే వివేక్, పొంగులేటి, కేవీపీ ఇండ్లు ఉన్నాయని తెలిపారు. శని, ఆదివారాలుల వచ్చాయంటేనే పేద ఇండ్లను హైడ్రా కూల్చివేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌ను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని.. 42 ఫ్లైఓవర్లు కట్టామన్నారు. రాహుల్ గాంధీకి హైడ్రా కూల్చివేతలు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏవీ కనపడవని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి జెండా కాంగ్రెస్ అయినా.. ఎజెండా బీజేపీదేనని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ఒక్కటేనని.. మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క పంచాయితీ కూడా లేదని.. పదేళ్లు జోర్దార్గా నడిచిన పాలన ఇప్పుడు ఆగమైందన్నారు. కేసీఆర్ రూ.లక్ష ఇస్తే.. తులం బంగారం కూడా ఇస్తామన్నారని.. ఇచ్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పుడు ఎక్కడా పుడ్తలేదని ఏ ముఖ్యమంత్రి అయినా అంటారా? అని నిలదీశారు. రాష్ట్రానికి సీఎం అయి ఉండీ ఇలా మాట్లాడుతారా? దొంగను దొంగ లెక్క చూడక మరెలా చేస్తారని ప్రశ్నించారు. ఎంతో మంది సీఎంలను చూశామని.. ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదన్నారు. ఇస్తామన్న హామీలపై నిలదీస్తే.. నన్ను కోసుకు తింటారా? అని అంటున్నాడని.. బీఆర్ఎస్ హయాంలో కరోనా టైమ్‌లోనూ ఏ సంక్షేమ పథకం ఆపలేదని.. బీఆర్ఎస్ హయాంలో కట్టిన వాటినే ఇప్పుడు ప్రారంభిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మనం కట్టిన ఫైఓవర్లకు సున్నం వేసి ఇప్పుడు ప్రారంభిస్తున్నారన్నారు.
ప్రధాని మోదీ హెచ్1బీ వీసాల గురించి ఏమైనా చెప్తాడేమోనని అనుకున్నానని.. జీఎస్టీ తగ్గించి పండుగ చేసుకో అని చెప్తున్నారని ఆరోపించారు. మొన్నటిదాకా రక్తం తాగి.. ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పండగ చేస్తో అంటే ఎలా? అని నిలదీశారు. నాడు గ్యాస్ ధర 450 ఉంటే.. ఇప్పుడు వెయ్యి దాటిందన్నారు. ముడి చమురు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదని.. ఇస్తామన్న రెండుకోట్ల ఉద్యోగాలు ఎక్కడ? అని ప్రశ్నించారు. మతం పేరిట రాజకీయం చేయడం మాత్రమే బీజేపీకి, మోదీకి వచ్చునన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో ఉచిత మంచినీళ్లు ఆపేస్తారని.. జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓటర్ల రూపంలో రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గతంలో జూబ్లీహిల్స్‌లో 4700 మెజారిటీ వస్తే ఈ సారి 10వేలు దాటాలన్నారు. అడ్డగోలు పైసలతో.. అలవిగాని హామీలతో ప్రమాణం చేస్తామని కాంగ్రెస్ నేతలు వస్తారని.. తప్పిదారి కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని.. వాళ్లను ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాలన్నారు. జూబ్లీహిల్స్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.