హుస్నాబాద్ టౌన్, ఫిబ్రవరి 26: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటై పట్టుమని పదిరోజులు గడవక ముందే కౌన్సిలర్లు ఎడమొఖం.. పెడ మొఖంలా మారినట్లు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఈనెల 16న జరిగింది. అనంతరం అధికార పక్షానికి చెందిన కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా మున్సిపల్ కార్యాలయంలో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. చైర్పర్సన్ గదిలో ప్రత్యేక పూజలు సైతం నిర్వహించేందుకు నిర్ణయించినప్పటికీ, ఆదిలోనే విబేధాలు పొడసూపినట్లు సమాచారం. దీంతో పాలకవర్గంలోని పలువురి మధ్య ఎడమొఖం పెడముఖంలాగా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధికార పక్షానికి చెందిన కౌన్సిలర్లలో ఎక్కువ మంది అసంతృప్తితో ఉన్నట్లు పార్టీవర్గాల్లో బహిరంగ చర్చ జరుగుతున్నది. ఎన్నికల్లో తాము చేసిన వ్యయం లో కొంతమొత్తాన్ని ఇవ్వాలనే అభిప్రాయం కౌన్సిలర్లు వ్యక్తపరిచినట్లు తెలిసింది. దీనిపై మెజార్టీ సభ్యులు ఒక నిర్ణయానికి రావడమే కాకుండా ప్రత్యేకంగా సమావేశం సైతం నిర్వహించుకున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. దీంతో చైర్పర్సన్ ప్రత్యేక ఛాంబర్లో పూజా కార్యక్రమం, సమావేశం సైతం వాయిదా పడ్డాయి. తాము సూచించిన విధంగా చేస్తే తప్ప మద్దతు ఇచ్చేందుకు సముఖంగా లేమనే విషయాన్ని పలువురు కౌన్సిలర్లు స్పష్టం చేయడంతో పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.
హుస్నాబాద్ మున్సిపల్లో మెజార్టీ స్థానాలు సాధించినప్పటికీ, చైర్మన్ అభ్యర్థి ఓటమి పాలునుంచి ఇంకా కోలుకోలేదు. ఈ తరుణంలో చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ కౌన్సిలర్ల వ్యవహారశైలి పార్టీని ఒకింత ఉలిక్కిపాటుకు గురిచేసిందనే చెప్పవచ్చు. పైగా ఈ విషయాన్ని సైతం కొందరు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చేరవేసినట్లు సమాచారం. దీనిపై కౌన్సిలర్లు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి ఆరాతీసి కొందరిని మందలించినట్లు తెలిసింది.
పైగా కౌన్సిలర్లతో ఒక నాయకుడు ప్రత్యేక సమావేశం నిర్వహించి మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాలు సైతం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిపొన్నం ప్రభాకర్‌తో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి ప్రత్యేకంగా సమావేశమై మున్సిపల్ వ్యవహారాలపై వివరించినట్లు సమాచారం. స్వయంగా కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి విభేదాలు తొలిగించడానికి కృషిచేస్తామని మంత్రి చైర్‌పర్సన్‌కు చెప్పినట్లు తెలిసింది. అయితే అధికారపక్షంలో మెజార్టీసభ్యులు ఆశిస్తున్నట్లు కొంత ముట్టజెప్పేందుకు చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ అంగీకరించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.