బడంగ్‌పేట : బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఎస్ఎన్డీపీ నాలా ఏర్పాటుకు నిధులు కెటాయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి (MLA Sabita Indra Reddy ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడంగ్‌పేట ముంపు ప్రాంతాలలో సోమవారం పర్యటించి కాలనీల పరిస్థితిని పరిశీలించారు.
ముంపు సమస్య ను పరిష్కరించాలని జయశంకర్ కాలనీ వాసులు ఎమ్మెల్యేను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ గోడును పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు. ప్రస్తుతం ఎక్కడైతే ఎస్ఎన్డీపీ నాలా ఏర్పాటు చేశామో ఆ కాలనీలలో ముంపు సమస్య లేదన్నారు. గత ప్రభుత్వం ముందుచూపుతో అల్మాస్ గూడ నుంచి మీర్పేట్ పెద్ద చెరువు వరకు ఎస్ఎన్డీపీ నాలా ఏర్పాటు చేయడానికి రూ.8 కోట్లు కెటాయించిందని గుర్తు చేశారు. స్వేచ్చా నివాస్ నుంచి నాలా ఏర్పాటు చేయడానికి గతంలోనే రూ.6కోట్లు కెటాయించమని పేర్కొన్నారు.
నిధులు విడుదల చేయక పోవడంతో నాలా పనులు ఆగిపోయాయన్నారు. నాలా ఏర్పాటు చేయక పోవడం కారణంగానే అల్మాస్ గూడ పరిధిలోని జయశంకర్ కాలనీ, సీవైఆర్ కాలనీ, బోయపల్లి ఇన్క్లెవ్, స్వేచ్చా నివాస్ , నాదర్‌గూల్ పరిధిలోని గ్రీన్ రిచ్ కాలనీ, గుర్రం గూడ తదితర కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు.
వంద రోజుల ప్రణాళికలో అధికారులు ఏం చేశారు ?
వంద రోజుల ప్రణాళికలో మున్సిపల్ అధికారులు నాలాలను క్లీన్ చేయలేక పోయారని ఆమె మండి పడ్డారు. నాలాలో ఉన్న మట్టి, చెత్త తీయలేక పోయారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. వంద రోజుల ప్రణాళిక కోసం నిధులు దుబార చేశారు తప్ప పనులు చేయలేదన్నారు. వరదలు వచ్చిన్నప్పుడు స్పందించడం కాదన్నారు. వరదలు రాకముందే నాలాలను క్లీన్ చేయించాలని చాలాసార్లు చెప్పానని వెల్లడించారు.
వాతావరణ శాఖ ఎప్పటికి అప్పుడు హెచ్చరికలు చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. వర్షాల కారణంగా కాలనీలు జలమయంగా మారుతున్నాయని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ వెంకన్న, బడంగ్‌పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బోయపల్లి శేఖర్ రెడ్డి, ముత్యాల కృష్ణ, జంగారెడ్డి,అర్కల కామేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.