Parakamani Contraversy | తిరుమల పరకామణి వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. పరకామణి కేసు రాజకీయంగా ప్రేరేపించినట్లు ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. శ్రీవారి పవిత్రతను రాజకీయం చేయాలని చూడటం సరికాదని సూచించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ఉందని అన్నారు. అందుకే ఈ వివాదంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పరకామణి నిధుల దుర్వినియోగం, దొంగతనం ఆరోపణలు నిరాధారమైనవని గురుమూర్తి తన లేఖలో పేర్కొన్నారు. అవన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 120 కోట్ల హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఇలా అవినీతి ముద్ర వేయడం భక్తి భావనను దెబ్బతీస్తోంది” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది భక్తులు సమర్పించే విరాళాలను సూచించే పరకామణి వ్యవస్థను రాజకీయ లబ్ధి కోసం వాడుకోసవడం సమాజంలో విభేదాలను రేకిత్తిస్తుందని హెచ్చరించారు.
భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే కేంద్ర సంస్థలతోనే దీనిపై విచారణ చేయించాలని అభిప్రాయపడ్డారు. భక్తి పవిత్రతను కాపాడటం, దాన్ని రాజకీయంగా వాడకుండా చూడటం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికే పరకామణి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిందని.. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ విచారణతోనే పారదర్శకత సాధ్యమవుతుందని అన్నారు. ఈ వివాదంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.