KTR | హైదరాబాద్ బోరబండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. వినాయక నగర్, ఎస్సార్టీ నగర్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా హాజరయ్యారు. కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంత మందితో నిండిపోయింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తుంటే గెలుపు పక్కా అని తేలిపోయిందని అన్నారు. మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే తెలంగాణ.. ఇప్పుడు ఎలా అయ్యిందో అందరూ ఆలోచించాలని జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ సూచించారు. తులం బంగారం ఇస్తామని చెప్పి.. మెడలో ఉన్న గొలుసులు కూడా లాక్కొంటున్నారని మండిపడ్డారు. సర్దార్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని.. వాళ్లను పెట్టిన హింసకు సమాధానం చెప్పాల్సిన టైమ్ వచ్చిందని అన్నారు. హిట్లర్ వంటి నియంతలకు కూడా పరాభవం తప్పలేదని.. ఇక రేవంత్ రెడ్డి ఎంత అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు ఓటేయకపోతే జూబ్లీహిల్స్ పథకాలు రద్దు చేస్తామని రేవంత్ బెదిరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎవడబ్బ సొమ్మని పథకాలు బంద్ చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ను గెలిపించండి.. కాంగ్రెస్ గల్లా పట్టి పథకాలు అమలు చేపిస్తామని స్పష్టం చేశారు. రంజాన్ తోఫా లేదు.. బతుకమ్మ చీర లేదు.. క్రిస్మస్ గిఫ్ట్ లేదు.. అన్ని బంద్ అయ్యాయని అన్నారు. హైదరాబాద్‌ను బర్బాద్ చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 4 కోట్ల మంది ప్రజల తరఫున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దొంగ ఓట్లు వేస్తారంటా.. పైసలు ఇచ్చి ఓట్లు కొంటారంటా.. పైసలు ఇస్తే తీసుకొని.. కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.