Telangana | రాష్ట్రంలో మెడికల్ పీజీ విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు ఇక తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు రెండు జీవోలు జారీ చేసింది. ఈ జీవో కారణంగా ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పీజీ వైద్య కాలేజీల్లో 50 శాతం సీట్లను అఖిల భారత కోటాలో, మిగతా 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో స్థానికులతో భర్తీ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న 19 ప్రైవేటు పీజీ మెడికల్ కాలేజీల్లో 1511 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సగం సీట్లను కన్వీనర్ కోటా కింద స్థానికులకు కేటాయిస్తున్నారు. మిగతా సీట్లను ఎంక్యూ1, ఎంక్యూ2 (ఎన్ఆర్ఐ), ఎంక్యూ3(ఇన్స్టిట్యూషనల్) కోటా కింద భర్తీ చేస్తారు. వీటిలో ఎంక్యూ 1 కింద 25 శాతం సీట్లు ఉండగా.. వీటన్నింటిని ఆలిండియా కోటాకే కేటాయించేవారు. అయితే ఎంక్యూ1లోని 85 శాతం సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.