నల్లగొండ, నవంబర్ 03 : సంక్షేమ హాస్టల్లో వసతి పొందే విద్యార్థినీలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అమ్మాయిలు అఘాయిత్యాలకు, కిడ్నాప్లకు గురికాకుండా బాధ్యతగా చూసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శశికళ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని బాలుర, బాలికల వసతి గృహాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, పాఠశాలకు వెళ్లేటప్పుడు బయట వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించినట్లయితే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్వాహకులకు ఆమె సూచించారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ ఎవరైనా ఇబ్బంది కలిగించినట్లయితే పోలీసులకు వెంటనే తెలియజేయాలన్నారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలని, హెచ్డబ్ల్యూఓఎస్ హాస్టల్ నిర్వహణలో బాధ్యతగా మెలగాలని పేర్కొన్నారు.